WPI inflation: 18 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం.. వరుసగా 4వ నెలా తగ్గుముఖం

ఆహారపదార్థాలు, ఇంధన, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరు నెలలో 10.7 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం.

Published : 14 Oct 2022 17:28 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరు నెలలో 10.7 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం కావడం విశేషం. ఆహారపదార్థాలు, ఇంధన, తయారీ వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు నేపథ్యం. ఇలా డబ్ల్యూపీఐ తగ్గడం ఇది వరుసగా నాలుగో నెల. కానీ, ఇంకా రెండంకెల్లోనే కొనసాగుతుండడం నిరాశపరుస్తున్న అంశం. 

మినరల్‌ ఆయిల్‌, ఆహార వస్తువులు, ముడి పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, బేసిక్‌ మెటల్స్‌, విద్యుత్తు, వస్త్రాల ధరలు పెరిగినందునే సెప్టెంబరులో టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. 2022 ఆగస్టులో డబ్ల్యూపీఐ 12.41 శాతంగా, 2021 సెప్టెంబరులో 11.80 శాతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలో ఇది 15.88 శాతం వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. కమొడిటీ ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తోందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

ఆహార పదార్థాల ధరలు ఆగస్టుతో పోల్చినప్పుడు 12.37 శాతం నుంచి 11.03 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం నుంచి 22.66 శాతానికి పెరిగాయి. చమురు, విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణం 33.67 శాతం నుంచి 32.61 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా.. నూనె గింజలు -16.55 శాతంగా నమోదైంది. మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41 శాతానికి చేరిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు