WPI Inflation: 4 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 14.55 శాతం వద్ద నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది...

Published : 18 Apr 2022 14:47 IST

దిల్లీ: మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI inflation)  14.55 శాతం వద్ద నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. చమురు, కమొడిటీ ధరలు పెరగడమే అందుకు కారణం. కూరగాయల ధరల్లో మాత్రం కాస్త ఒత్తిడి తగ్గింది. ఇలా టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదు కావడం ఇది వరుసగా 12వ నెల. క్రితం ఏడాది మార్చిలో ఇది 7.89 శాతంగా నమోదైంది.

ఫిబ్రవరిలో 8.19 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం నెల వ్యవధిలో 26.93 శాతం నుంచి 19.88 శాతానికి తగ్గడం విశేషం. ‘‘చమురు, సహజవాయు, మినరల్‌ ఆయిల్స్‌, బేసిక్‌ మెటల్స్‌ వంటి ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో నెలకొన్న అస్థిరతలే ధరలు ఎగబాకడానికి కారణమయ్యాయి’’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 10.71%, ఇంధనం, విద్యుత్తు 34.52%, ముడి పెట్రోలియం ద్రవ్యోల్బణం 83.56 శాతంగా నమోదైంది.

మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇది ఆర్‌బీఐ లక్షిత పరిధి అయిన 4-6 శాతాన్ని అధిగమించడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఏప్రిల్‌ 8న వెలువడిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. రెపోరేటు 4 శాతం, రివర్స్‌ రెపోరేటు 3.75 శాతంగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని