Elon Musk: ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్‌ హెచ్చరిక..!

తొలగించిన ఉద్యోగులకు అధికమొత్తం చెల్లించామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని మాజీ ఉద్యోగులకు ‘ఎక్స్‌’ నుంచి మెయిల్ వెళ్లింది. 

Updated : 15 Jun 2024 14:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్(Elon Musk) తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో వార్తల్లోనిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్(ట్విటర్) మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలన్నారు.

2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్‌గా మార్చారు. అలాగే దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. అయితే ఆస్ట్రేలియాలోని కొందరు ఉద్యోగులకు చెల్లించాల్సినదానికంటే ఎక్కువ ముట్టిందని ఎక్స్ వెల్లడించింది. కరెన్సీ కన్వర్షన్, షేర్ల మదింపు సమయంలో జరిగిన పొరపాట్లు ఈ పరిస్థితికి దారితీశాయని తెలిపింది. ఆ సంస్థ ఆసియా ఫసిఫిక్ మానవవనరుల విభాగ అధికారుల్ని ఉటంకిస్తూ సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘‘ మీరు వీలైనంత త్వరగా తిరిగి చెల్లింపులు చేస్తే సంతోషిస్తాం’’ అంటూ మాజీ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు పేర్కొంది. వారు చెల్లించాల్సిన మొత్తం 1500 డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే ఆరుగురు మాజీలకు లీగల్ నోటీసులు అందినట్లు వెల్లడించింది.

ఉద్యోగినులతో ‘మస్క్‌’ లైంగిక సంబంధం..! అమెరికా నాట సంచలన కథనం

కొద్దినెలల క్రితం ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్‌ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు