Xiaomi EV project: షావోమి ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌కు చిక్కులు.. 2024 ప్లాన్‌కు గండి?

Xiaomi EV project:  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమికి (Xiaomi) సొంత దేశంలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి.

Updated : 29 Jul 2022 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమికి (Xiaomi) సొంత దేశంలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి. 2024 కల్లా తొలి ఎలక్ట్రిక్‌ కారును తీసుకురావడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ను (EV project) మొదలు పెట్టిన ఆ కంపెనీకి ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కార్ల తయారీకి కావాల్సిన అనుమతులు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలలు గడిచినప్పటికీ అప్లికేషన్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు. దీనిపై నియంత్రణ సంస్థతో ఆ కంపెనీ చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురావడం కోసం ఓ అనుబంధ విభాగాన్ని 2021లో షావోమి ఏర్పాటు చేసింది. రాబోయే 10 ఏళ్లలో 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. 2024 కల్లా తొలి వాహనం తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం బీజింగ్‌లో స్థలాన్ని కూడా సేకరించింది. సాంకేతిక సాయం కోసం చిన్న చిన్న ఈవీ స్టార్టప్పులను సైతం కొనుగోలు చేసింది. ఈ క్రమంలో అనుమతుల కోసం నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌ వద్ద దరఖాస్తు చేసుకుంది. ఇక్కడే ఆ కంపెనీకి ఆటంకాలు నెలకొన్నాయి.

ఈవీ రంగంలో ప్రవేశించిన పెద్ద కంపెనీలు దివాళా తీస్తుండడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీంతో దరఖాస్తు ప్రక్రియను సంక్లిష్టం చేసింది. కొత్తగా దరఖాస్తులు చేసేవారు ఆర్థిక, సాంకేతిక సామర్థ్యానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని సూచిస్తోంది. దీనికి తోడు దరఖాస్తుల పరిశీలనకు నెలల సమయం తీసుకుంటోంది. ఒకవేళ కంపెనీ దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చినట్లే. ఈ ప్రక్రియలో షావోమి దరఖాస్తు సైతం చిక్కుకుపోయింది.

ప్రస్తుతం చైనాలో టెస్లా, నియో, వారెన్‌ బఫెట్‌ పెట్టుబడులు ఉన్న బైడ్‌ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో అతిపెద్ద కంపెనీలుగా ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు సైతం ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్న షావోమికి.. అనుమతుల వద్ద కాలయాపన జరుగుతోంది. దీనివల్ల ఇప్పటికే ఉన్న కంపెనీలు మరింత ముందుకెళ్లిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు కంపెనీ ప్రణాళికలు దెబ్బతింటున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దీనిపై షావోమి గానీ, ఇటు ఎన్డీఆర్‌సీ గానీ అధికారికంగా స్పందించలేదని బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని