Xiaomi India: పాకిస్థాన్‌కు షావోమీ కార్యకలాపాలు?.. కంపెనీ క్లారిటీ!

భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి దర్యాప్తు ఎదుర్కొంటున్న నేపథ్యంలో షావోమీ ఇండియా తమ కంపెనీ కార్యకలాపాలను ఇక్కడి నుంచి పాక్‌కు తరలిస్తోందంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది.

Published : 07 Oct 2022 15:56 IST

దిల్లీ: భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి దర్యాప్తు ఎదుర్కొంటున్న నేపథ్యంలో షావోమీ ఇండియా (Xiaomi India) తమ కంపెనీ కార్యకలాపాలను పాక్‌కు తరలిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. తమ సంస్థ కార్యకలాపాలను ఎక్కడికీ తరలించడం లేదని, ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇటీవల ఆ కంపెనీకి చెందిన రూ.5551.27 కోట్ల నగదును ఈడీ సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను దాదాపుగా నిలిపివేసిందని, త్వరలోనే పాక్‌కు తరలించబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది.

‘‘2014 జులైలో భారత్‌లోకి షావోమీ ప్రవేశించింది. కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తికాక ముందే మేం మా ‘మేకిన్‌ ఇండియా’ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. నేడు 99 శాతం స్మార్ట్‌ఫోన్లు, 100 శాతం స్మార్ట్‌ టీవీలు భారత్‌లోనే తయారవుతున్నాయి. ఓ గ్లోబల్‌ కంపెనీగా తప్పుడు, నకిలీ సమాచారం బారి నుంచి కంపెనీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ఆ సంస్థ తెలిపింది.

గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్ల సమానమైన నిధులను విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు షావోమీ ఇండియా పంపిందంటూ ఈడీ తెలిపింది. ఫెమా చట్టానికి విరుద్ధంగా రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని తరలిస్తోందని పేర్కొంటూ ఆ నగదును సీజ్‌ చేసింది. నగదు జప్తు చేయకుండా స్టే విధించాలంటూ షావోమీ ఇండియా కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిని కోర్టు తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని