‘ప్లీజ్‌ ఆ పని మాత్రం చేయొద్దు’.. తల్లిదండ్రులకు షావోమి మాజీ సీఈవో విజ్ఞప్తి!

పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ (Smartphone/Tab) అలవాటు చేయడంపై తల్లిదండ్రులకు (Parents) షావోమి ఇండియా (Xiaomi India) మాజీ సీఈవో మను కుమార్‌ జైన్‌ (Manu Kumar Jain) ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు. 

Published : 21 May 2023 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాదు.. అంతకు మించిన సేవలను వినియోగదారులకు అందిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రౌజింగ్‌, షాపింగ్‌, ఫుడ్‌ ఆర్డర్‌, గేమింగ్‌.. ఇలా చెబితే పెద్ద జాబితా ఉంటుంది. అందుకే, ఐదేళ్ల పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వినియోగానికి సులువుగా అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే పిల్లల స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో జరిపిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగుచూశాయి.

చిన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. దాంతోపాటు, చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించిన పిల్లలు.. యుక్త వయసుకు వచ్చేసరికి పలు మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ షావోమి ఇండియా (Xiaomi India) మాజీ సీఈవో మను కుమార్‌ జైన్‌ (Manu Kumar Jain) తల్లిదండ్రులకు (Parents) ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. 

‘‘ తల్లిదండ్రులకు నాదో విజ్ఞప్తి. మీ పిల్లలు ఏడుస్తున్నారని, అన్నం తినడంలేదని, అల్లరి చేస్తున్నారనే కారణంతో వారికి స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ ఇవ్వకండి. దానికి బదులు వారికి ఇతర వ్యాపకాలను అలవాటు చేయండి. ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించండి. పదేళ్ల వయసుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించిన వారిలో 60-70 శాతం మంది అమ్మాయిలు, 45-50 శాతం మంది అమ్మాయిలు యుక్తవయసుకు వచ్చేసరికి, వివిధ రకాల మానసిక రోగాల బారిన పడుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి బాల్యం ఎంతో విలువైందని గుర్తించండి’’ అని మను కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు.

అలానే చిన్నారులను ఎక్కువ సమయం డిజిటల్‌ తెరలకు అలవాటు చేసి వారి బాల్యాన్ని నాశనం చేయొద్దని కోరారు. పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం తల్లిదండ్రుల బాధ్యతగా భావించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ వినియోగానికి తాను వ్యతిరేకం కాదని జైన్‌ తెలిపారు. డిజిటల్‌ డివైజ్‌లు మనుషుల మధ్య దూరాలను తగ్గించి, వారి జీవితాలను సులభతరం చేశాయని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను తనుకూడా ఎక్కువగానే ఉపయోగిస్తానని తెలిపారు. కానీ, పిల్లలకు వాటిని ఇచ్చే విషయంలో అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని