Xiaomi SU7 EV: త్వరలో భారత్‌లో షియోమీ విద్యుత్‌ కారు ఎస్‌యూ7 ప్రదర్శన!

భారత విద్యుత్‌ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది.

Published : 06 Jul 2024 02:05 IST

దిల్లీ: భారత విద్యుత్‌ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. సంస్థ ఇటీవల ఆవిష్కరించిన విద్యుత్‌ కారు ‘ఎస్‌యూ7’ను మనదేశంలోనూ ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును మన దేశానికి సంస్థ తీసుకొచ్చిందని, త్వరలోనే బెంగళూరులో దీనిని ప్రదర్శిస్తుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తెలిపింది. ఇప్పటికిప్పుడే ఈ కారును భారత విపణిలో విడుదల చేయాలనే యోచన లేదని షియోమీ చెబుతోంది. అయితే భారత కార్ల విపణిలో ఉన్న తమ బ్రాండుకు ఉన్న ఆకర్షణను పరిశీలించేందుకు; భారత్‌లో షియోమీ వ్యాపార కార్యకలాపాలకు దశాబ్దకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలో ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. ఎస్‌యూ7 కారుతో పాటు షియోమీ ఉత్పత్తి చేస్తున్న గృహోపకరణాలనూ బెంగళూరులో షియోమీ ప్రదర్శించే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

స్పీడ్‌ అల్ట్రాగా వ్యవహరించే ఎస్‌యూ7 అభివృద్ధికి 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల)ను వెచ్చించినట్లు షియోమీ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో చైనాలో ఈ కార్ల డెలివరీ ప్రారంభం అయ్యింది. ఎస్‌యూ7 బేస్‌ మోడల్‌ ధర 30,000 డాలర్ల లోపే (సుమారు రూ.25 లక్షలు). చైనాలో టెస్లా మెడల్‌ 2 బేస్‌ మోడల్‌ ధర కంటే దీని ధర 4000 డాలర్లు (రూ.3.30 లక్షలు) తక్కువ.  ఒక్కసారి ఛార్జింగ్‌తో 668 కి.మీలు; 800 కి.మీ వరకు ప్రయాణించేలా ఈ కారు మోడళ్లను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని