Yamaha bikes: కొత్త ప్రమాణాలతో యమహా బైక్స్‌.. లేటెస్ట్‌ ధరలివీ..

Yamaha: కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా యమహా తన మోటార్‌ సైకిల్స్‌ను తీర్చిదిద్దింది. కొన్నింటిలో మార్పులు చేపట్టింది.

Published : 13 Feb 2023 18:05 IST

దిల్లీ: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha Motor India) భారత్‌లో తన ద్విచక్ర వాహన శ్రేణిలో కొన్ని మార్పులు చేసింది. 149సీసీ-155సీసీ సెగ్మెంట్‌లో ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (TCS)ను మరిన్ని వాహనాలకు విస్తరించింది. ఏడాది చివరికల్లా అన్ని మోటార్‌ సైకిళ్లను E20 (20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) ఫ్యూయల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అన్ని వాహనాల్లోనూ ఆన్‌ బోర్డ్‌ డయాగ్నొస్టిక్స్‌ (OBD-II) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఇప్పటి వరకు యమహా బైకుల్లో R15M, R15V4 మోడళ్లలో మాత్రమే ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను (TCS) ఉంది. ఇంజిన్‌ పవర్ అవుట్‌పుట్‌కు అనుగుణంగా చక్రానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు చక్రం జారడం తగ్గించడంలో ఈ వ్యవస్థ సాయపడుతుంది. ఈ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను FZS-Fi V4 Deluxe, FZ-X, MT-15 V2 మోడళ్లలో సైతం అందిస్తున్నట్లు  యమహా పేర్కొంది. అలాగే, ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్న ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అన్ని మోడళ్లనూ మార్పు చేసినట్లు యమహా తెలిపింది.

ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడంతో పాటు కర్బన ఉద్గారాల కట్టడికి తాము కట్టుబడి ఉన్నామని యమహా తెలిపింది. ఇందులో భాగంగా FZS-Fi V4 Deluxe, FZ-X మోడళ్లను ఈ20 ఫ్యూయల్‌తో నడిచే విధంగా ఇంజిన్‌ తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఏడాది చివరి నాటికి అన్ని మోడళ్లలోనూ E20 ఫ్యూయల్‌కు అనుగుణంగా మార్చనున్నట్లు యమహా తెలిపింది.

లేటెస్ట్‌ ధరలివీ.. (ఎక్స్‌షోరూమ్‌)

  • FZS-Fi V4 Deluxe- రూ.1.27 లక్షలు
  • FZ-X - రూ.1.37 లక్షలు
  • R15M- రూ.1.94 లక్షలు
  • R15V4 - రూ.1.82 లక్షలు
  • MT15 V2 Deluxe- రూ.1.68 లక్షలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని