Year Ender 2022: ‘మూన్ లైట్’పై చర్చలు.. స్టార్టప్‌లలో కోతలు!
కొలువులు, వేతనాల పెంపు మాట అటుంచితే ఐటీ రంగంలో ఈ ఏడాది మూన్‌లైటింగ్ వ్యవహారంపై భారీగా చర్చ జరిగింది. స్టార్టప్‌ల్లో ఉద్యోగ కోతలు సైతం ఆందోళన కలిగించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఏ కంపెనీ ఎంతమందిని నియమించుకోబోతోంది? వేతన పెంపు ఎంత? బోనస్‌లతో పాటు ఇతర ప్రయోజనాలేమిస్తారు?’.. కరోనాకు ముందు ఉద్యోగాల విషయంలో ఇలాంటి విచారణలే ఉండేవి. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘మీ కంపెనీలో వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఓకేనా? మూన్‌లైటింగ్ విషయంలో ఎలా ఉంటున్నారు?’... ఈ ఏడాది చర్చంతా దాదాపు వీటిపైనే జరిగింది. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే స్టార్టప్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించడం కలకలం రేపింది. మొత్తానికి 2022 సంవత్సరంలో ఉద్యోగాలకు సంబంధించిన వివిధ అంశాలు నిత్యం చర్చకు వస్తూ వార్తల్లో నిలిచాయి.
‘ఇంటి’ నుంచి రప్పించేందుకు తంటాలు
కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు ఐటీ సహా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఇంటి నుంచి పని చేసే విధానానికి చాలా మంది అలవాటు పడ్డారు. అయితే, పనితీరు నెమ్మదించడం, ఉత్పాదకత తగ్గడం వంటి కారణాలతో కంపెనీలు మళ్లీ అందర్నీ ఆఫీసులకు రప్పించేందుకు ఈ ఏడాది ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ, అదంత సులువు కాదని తెలిసి.. మధ్యేమార్గంగా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి. అయితే, మధ్య మధ్యలో పలకరిస్తున్న కరోనా భయాలతో.. వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
‘మూన్లైట్’పై భిన్న వాదనలు
ఒక కంపెనీలో పనిచేస్తూ అదనపు ఆదాయం కోసం మరో కంపెనీలో పనిచేయడాన్ని మూన్‌లైటింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఎక్కువగా చర్చకొచ్చిన అంశాల్లో ఇదీ ఒకటి. వర్క్‌ఫ్రమ్ హోమ్ సంస్కృతి దీనికి ఆజ్యంపోసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ సైతం దీన్ని తప్పుబట్టాయి. అదే సమయంలో స్విగ్గీ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ‘మూన్‌లైటింగ్’కు అనుమతించడం గమనార్హం. ‘మూన్‌లైటింగ్’ వల్ల ఉద్యోగి ఉత్పాదకత తగ్గడంతో పాటు, కంపెనీ రహస్యాలు పోటీ కంపెనీలకు తెలిసే అవకాశం ఏర్పడుతుందనేది దీన్ని వ్యతిరేకించే వారి వాదన. అదే సమయంలో ఉద్యోగి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ‘మూన్‌లైటింగ్’ ఉపయోగపడుతుందని సమర్థించేవారూ ఉన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రభుత్వం ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చట్ట ప్రకారం ఒక కంపెనీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉద్యోగి మరో కంపెనీలో పనిచేయడం సరికాదని స్పష్టంచేయడం ద్వారా భిన్న వాదనలకు ఫుల్స్టాప్ పెట్టినట్లయ్యింది.
స్టార్టప్‌ల్లో ఉద్యోగ కోతలు..
2022లో ఆందోళనకర పరిణామాల్లో స్టార్టప్‌లో ఉద్యోగాల కోత ఒకటి. స్టార్టప్‌లకు స్వర్గధామంగా పేరొందిన మన దేశంలో ఈ తరహా పరిణామాలు కొంత ఆందోళన కలిగించేవే. ముఖ్యంగా కరోనా సమయంలో విపరీతమైన ఆదరణ పొందిన ఎడ్యుటెక్ కంపెనీలైన బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు.. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోతకు పాల్పడ్డాయి. బైజూస్ 2500 మందిని, అన్ అకాడమీ 1500, వేదాంతు 1100కు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. ఇవి కాకుండా ఓలా, బ్లింకిట్, ఓయో, మీషో, వైట్ హ్యాట్ జూనియర్, కార్స్ 24, జొమాటో వంటివీ ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 18 వేల మంది ఉద్యోగుల్ని స్టార్టప్ కంపెనీలు ఇంటికి పంపించాయి. గతంలో పరిమితికి మించి ఉద్యోగుల్ని నియమించుకోవడం, కొనుగోళ్ల అనంతరం కంపెనీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వంటి కారణాలతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి.
మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బిగ్ టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఇటీవల ఉద్యోగాల్లో కోత పెట్టాయి. అయితే, భారత ఐటీ పరిశ్రమ విషయానికొస్తే దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఇప్పటికీ వలసలు కొనసాగుతున్నాయి. అంటే పోటీ కంపెనీలు పెద్ద మొత్తంలో వేతనంతో ఉద్యోగుల్ని చేర్చుకుంటున్నాయి. మాంద్యం భయాల కారణంగా ఐటీ సహా ఇతర రంగాల్లో నియామకాల్లో వేగం కొంత మేర తగ్గింది. వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే, నైపుణ్యాలు మెరుగుపర్చుకునే వారికి మాత్రం పెద్ద ఇబ్బంది ఉండదని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక