Rana Kapoor: మనీలాండరింగ్‌ కేసులో రాణా కపూర్‌కు బెయిల్‌

రూ.466.51 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ 2020లో అరెస్టు చేసింది. తాజాగా ఆయనకు దిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 25 Nov 2022 14:47 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన రూ.466.51 కోట్ల అక్రమ నగదు చలామణి కేసులో యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2020లో ఈడీ ఆయనను ‘అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA)’ కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయిలోని తలోజా జైలులో ఉన్నారు. గతంలో పలుసార్లు ఆయన అనారోగ్య కారణాలరీత్యా బెయిల్‌ మంజూరు చేయాలని ట్రయల్‌ కోర్టును అభ్యర్థించారు. కానీ, కపూర్‌పై ఉన్న నేరాభియోగాలు చాలా తీవ్రమైనవని పేర్కొంటూ న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా రాణా కపూర్‌ ఆయన కుటుంబ నిర్వహణలో ఉన్న కంపెనీల ద్వారా రూ.4,300 కోట్లు విలువ చేసే లబ్ధిపొందారని ఈడీ ఆరోపించింది. యెస్‌ బ్యాంకులో కపూర్‌ పదవిలో ఉండగా రూ.30,000 కోట్లు విలువ చేసే రుణాలు మంజూరు చేశారని తెలిపింది. ఇందులో దాదాపు రూ.20 వేల కోట్లు మొండి బకాయిలుగా మారాయని పేర్కొంది. మరోవైపు బడా కార్పొరేట్‌ కంపెనీల నుంచి రుణాలు వసూలు చేయడంలో లంచాలు తీసుకొని కపూర్‌ ఉదాసీనంగా వ్యవహరించారని.. ఫలితంగా అవి నిరర్థక ఆస్తులుగా మారిపోయాయని ఆరోపించింది. ఈ అభియోగాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం విచారణ జరిపింది. సెప్టెంబరులోనే ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జిషీటు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇంకా తనని కస్టడిలో ఉంచాల్సిన అవసరం లేదని.. అనారోగ్య కారణాలరీత్యా బెయిల్‌ మంజూరు చేయాలన్న కపూర్‌ తాజా అభ్యర్థనను దిల్లీ హైకోర్టు సమ్మతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని