నెలాఖరుకి ₹48000 కోట్ల యెస్‌ బ్యాంక్‌ బకాయిలు ఏఆర్‌సీకి బదిలీ

Yes Bank: ఈ నెలాఖరు కల్లా యెస్‌ బ్యాంక్‌ నిరర్థక ఆస్తుల్ని 2 శాతానికి తగ్గే అవకాశం ఉందని సీఈఓ ప్రశాంత్ కుమార్‌ తెలిపారు. దాదాపు రూ.48 వేల కోట్ల మొండి బకాయిల్ని ఏఆర్‌సీకి బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

Published : 03 Nov 2022 23:30 IST

ముంబయి: తమ మొండి బకాయిలను ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థ జేసీ ఫ్లవర్స్‌ ఏఆర్‌సీకి విక్రయించే ప్రక్రియ ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుందని యెస్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. దాదాపు రూ.48,000 కోట్ల బకాయిలను బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరర్థక ఆస్తులన్నీ బ్యాంకు సహ-వ్యవస్థాపకుడు రానా కపూర్‌ నేతృత్వంలోని పూర్వ యాజమాన్యం నుంచి తమకు అందినవేనని తెలిపారు.

ఈ బకాయిల బదిలీతో యెస్‌ బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతానికి తగ్గనుంది. జేసీ ఫ్లవర్స్‌ను ఎంపిక చేయడంలో అన్ని నియమాలు పాటించామని బ్యాంకు అధికారులు తెలిపారు. రూ.48 వేల కోట్ల మొండి బకాయిలకు గానూ జేసీ ఫ్లవర్స్‌ ముందస్తు చెల్లింపుల కింద రూ.11,183 కోట్లు కట్టనుంది. ఇది బకాయిల్లో 23 శాతానికి సమానం. అదే సమయంలో ఈ ఏఆర్‌సీలో బ్యాంకు తొలుత 9.9 శాతం వాటా తీసుకోనున్నట్లు ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఆర్‌బీఐ అనుమతితో తర్వాత దాన్ని 20 శాతానికి పెంచుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు ఈక్విటీ ఫండ్ల నుంచి యెస్‌ బ్యాంక్‌ మరో రూ.8,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని