Revised ITR: ఐటీఆర్‌లో తప్పులా? సవరించేందుకు ఇంకా ఒక అవకాశం ఉంది!

Revised ITR: ఐటీ రిటర్నుల్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే రివైజ్డ్‌ ఐటీఆర్‌ ద్వారా సవరించుకునేందుకు అవకాశం ఉంది. దానికి డిసెంబరు 31 తుది గడువు.

Published : 23 Dec 2022 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ పన్ను రిటర్నులు (ITR) సమర్పించిన తర్వాత ఒక్కోసారి వాటిలో తప్పు జరిగినట్లు గమనిస్తుంటాం. అలాంటి పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ‘ఆదాయ పన్ను చట్టం 1961’ మనకు వెసులుబాటు కల్పిస్తోంది. దాన్నే ‘రివైజ్డ్‌ ఐటీఆర్‌ (Revised ITR)’గా వ్యవహరిస్తున్నారు. మరి 2022- 23 సమీక్షా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన ఐటీఆర్‌ (ITR)లో ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకునేందుకు 2022 డిసెంబరు 31 వరకు అవకాశం ఉంది. గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ రివైజ్డ్‌ రిటర్నుల (Revised ITR) ముఖ్య ఉద్దేశం. 

ఆదాయం, క్లెయింలనూ మార్చొచ్చు..

తొలుత దాఖలు చేసిన ఐటీఆర్‌లో ఏదైనా ఆదాయాన్ని పేర్కొనడం మర్చిపోతే రివైజ్డ్‌ రిటర్నుల్లో దానికి సంబంధించిన వివరాలను పొందుపర్చవచ్చు. ఏదైనా పెట్టుబడిపై పన్ను మినహాయింపును కోరే అవకాశమూ ఉంది. విరాళాలేమైనా గతంలో మర్చిపోయి ఉంటే.. వాటిని కూడా ప్రస్తావించి ప్రయోజనం పొందవచ్చు. వ్యక్తిగత వివరాల్లో ఏమైనా తప్పులున్నా సవరించుకోవచ్చు.

గత రిటర్నుల్లో ఆదాయం తక్కువగా పొందుపర్చినా లేక ఎక్కువగా ప్రస్తావించినా తగు మార్పులు చేసి రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ రివైజ్డ్‌ రిటర్నుల్లో అధిక ఆదాయాన్ని చేరిస్తే.. అదనపు పన్నుతో పాటు దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి జరిమానా ఉండదు.

ఎవరు చేయొచ్చు...

ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఎవరైనా.. తమ ఒరిజినల్‌ రిటర్నుల్లో తప్పు దొర్లినట్లు గమనిస్తే రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేయొచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ‘బిలేటెడ్‌ రిటర్నులు (Belated ITR) దాఖలు చేసినప్పటికీ.. రివైజ్డ్‌ రిటర్నులను సమర్పించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మీ రిటర్నులపై సమీక్ష పూర్తి చేస్తే మాత్రం అనుమతి ఉండదు. సమీక్షా సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకే రివైజ్డ్‌ రిటర్నుల దాఖలుకు అవకాశం ఉంటుంది. అంటే 2022-23కు గానూ ఈ నెల 31వరకు గడువు ఉంది.

ఎలాంటి చర్యలు ఉంటాయి..

బ్యాంకు ఖాతా వివరాలు లేదా పేరులో సవరణ వంటి చిన్న చిన్న మార్పులకు ఎలాంటి చర్యలు ఉండవు. అయితే, అదనపు ఆదాయాన్ని పేర్కొనడం వంటి కీలక సవరణలు ఉంటే మాత్రం తగు మార్పులు చేస్తూనే.. ఆదాయ పన్ను విభాగం తనిఖీలను కూడా చేపట్టే  అవకాశం ఉంది. పైగా ఎక్కువ ఆదాయం ఉంటే ముందుగా చెప్పినట్లు దానిపై పన్నుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

రివైజ్డ్‌ రిటర్నులను దాఖలు చేస్తున్నారంటే.. ఇక మీ ఒరిజినల్‌ రిటర్నులను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని అర్థం. అప్పుడు రివైజ్డ్‌ రిటర్నులనే తుది రిటర్నులుగా పరిగణిస్తారు.

ఐటీఆర్‌ ఫారం మార్చుకోవాలన్నా.. రివైజ్డ్‌ రిటర్నులను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

రివైజ్డ్‌ రిటర్నులను ఎన్నిసార్లు దాఖలు చేయాలనే అంశంపై చట్టంలో ఎలాంటి పరిమితి లేదు. అయితే, తరచూ మార్పులు చేయాల్సి వస్తే కచ్చితంగా దర్యాప్తు సంస్థల తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు