Loan repayment: ఇకపై ఆ లోన్‌లను క్రెడిట్‌ కార్డుతో చెల్లించలేరు!

Loan repayment: బీమా పాలసీలపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు క్రెడిట్‌ కార్డును ఉపయోగించడం కుదరదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. 

Published : 05 May 2023 20:12 IST

దిల్లీ: మీరు బీమా పాలసీలపై లోన్‌ (Loan against Insurance policy) తీసుకున్నారా? అయితే, భారతీయ బీమా నియంత్రణ మండలి (IRDAI) మీకో కీలక విషయం తెలియజేసింది. ఇకపై అలాంటి లోన్‌లను క్రెడిట్‌ కార్డు (Credit card) ద్వారా తిరిగి చెల్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘ఇన్సూరెన్స్‌ పాలసీలపై రుణం తీసుకున్నవారు వాటిని క్రెడిట్‌ కార్డు (Credit card) ద్వారా తిరిగి చెల్లించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలన్నీ.. క్రెడిట్‌ కార్డు (Credit card) ద్వారా చేసే రుణ చెల్లింపులను అనుమతించొద్దని సూచిస్తున్నాం. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి’’ అని ఉత్తర్వుల్లో ఐఆర్‌డీఏఐ (IRDAI) పేర్కొంది.

ఎన్‌పీఎస్‌ టైర్‌-II ఖాతాల సబ్‌స్క్రిప్షన్‌, వాటిలో చందా జమ చేసేందుకు కూడా క్రెడిట్‌ కార్డు (Credit card)ను అనుమతించబోమని 2022 ఆగస్టులోనే ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)’ తెలిపింది. క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే ఆ బకాయిలను చెల్లించడానికి ఒక నెల వడ్డీరహిత గడువు ఉంటుంది. అయితే, ఒకవేళ రుణదాతలు క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించని పక్షంలో వడ్డీభారం భారీగా ఉంటుంది. ఇది రుణదాతల ఆర్థిక కష్టాలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే బీమా పాలసీపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ముందుజాగ్రత్తగా క్రెడిట్‌ కార్డు (Credit card)ను ఐఆర్‌డీఏఐ అనుమతించడం లేదని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని