Loans: ఐటీఆర్‌ లేకుండా లోన్‌ పొందాలంటే..

పెద్ద రుణాలు పొందడానికి ఐటీఆర్‌ తప్పనిసరి. కానీ, కొన్ని సందర్భాల్లో ఐటీఆర్‌ లేకుండా కూడా లోన్‌ను పొందొచ్చు. ఆ మార్గాలేంటో చూద్దాం..

Published : 08 Dec 2022 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు లోన్ (Loan) కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత మీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి కొన్ని పత్రాలను కోరతారు. వాటిలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ముఖ్యమైనది. ముఖ్యంగా పెద్ద రుణాలకు ఇది తప్పనిసరి. వేతన జీవులకు ITR ఉంటుంది. కానీ, స్వయం ఉపాధిలో ఉన్నవారు.. వార్షిక ఆదాయ పన్ను పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు ఐటీఆర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్‌ లేకుండానే లోన్‌ ఎలా పొందాలో చూద్దాం..

పర్సనల్‌ లోన్‌..

ఐటీఆర్‌ లేకుండా రుణం పొందేందుకు ఉన్న తేలికైన మార్గం పర్సనల్‌ లోన్‌. ఎలాంటి తనఖా లేకుండానే రుణం పొందొచ్చు. ఈ రుణాలు ప్రాథమికంగా దరఖాస్తుదారు ఆదాయం, KYC వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. కొన్ని బ్యాంకులు కనీస ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండి, గతంలో ఎటువంటి ఎగవేతలు లేకుండా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. వేతన జీవులైతే బ్యాంకు ఖాతాను ఆధారంగా చేసుకొని సులువుగానే రుణం పొందొచ్చు. ఖాతాలోకి నిధుల ప్రవాహాన్ని బట్టి సంస్థలు లోన్‌ను మంజూరు చేస్తాయి.

సెక్యూరిటీలపై రుణం..

సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తులేవైనా తనఖా పెట్టి లోన్‌ తీసుకుంటే బ్యాంకులు వాటిని తక్కువ రిస్క్‌గా పరిగణిస్తాయి. ఈ రుణాలను కూడా అవి ఐటీఆర్‌ లేకుండానే ఇస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు మొదలైన పెట్టుబడులను తాకట్టు పెట్టవచ్చు. సెక్యూరిటీలపై రుణం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సహ దరఖాస్తుదారుడితో కలిసి..

మీకు ITR లేకపోతే, ప్రత్యేకించి మీరు స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే, ITR లేదా ఇతర ఆదాయ మార్గాల రుజువులతో సహ-దరఖాస్తుదారుడితో ఉమ్మడి రుణం కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా జాయింట్‌గా రుణం తీసుకుంటే బ్యాంకులు ఇద్దరి ఆదాయాన్ని కలిపి పరిగణనలోకి తీసుకుంటాయి. ఫలితంగా ప్రధాన దరఖాస్తుదారు మొత్తం రుణ అర్హత మెరుగుపడుతుంది.

చిన్న రుణం ఉత్తమం..

ITR లేదా ఇతర అవసరమైన రుజువు లేనప్పుడు తక్కువ మొత్తంలో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రుణసంస్థలు ప్రాథమిక ఆదాయ పత్రాల ఆధారంగా చిన్న మొత్తాల రుణాలను మంజూరు చేస్తాయి. పైగా ఇవి వేగంగానూ ఆమోదం పొందుతాయి. ఒక చిన్న రుణం మీ అవసరాన్ని పాక్షికంగా మాత్రమే తీర్చినప్పటికీ.. పొందడం, తిరిగి చెల్లించడం మాత్రం చాలా సులభం.

ప్రత్యేక పథకాల కింద..

బ్యాంకులు కొన్నిసార్లు ప్రత్యేక స్కీమ్‌లను ఆఫర్‌ చేస్తుంటాయి. కొంతమంది ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఎటువంటి పత్రాలు లేకుండానే రుణాలను అందిస్తాయి. నిర్దేశించిన అర్హతలు ఉంటే సరిపోతుంది. 

ఇవి ITR లేకుండా అవసరమైన లోన్‌ను పొందడంలో సహాయపడే కొన్ని చిట్కాలు మాత్రమే. కానీ, సంస్థలు, బ్యాంకులను బట్టి నిబంధనలు మారొచ్చు. కాబట్టి రుణం తీసుకోవడానికి ముందు ఆయా బ్యాంకుల నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు