Credit Card EMI: క్రెడిట్‌కార్డుతో ఈ కొనుగోళ్లు చేస్తే ఈఎంఐగా మార్చుకోలేరు!

CredtCard EMI: కొన్ని సందర్భాల్లో మాత్రం క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లను ఈఎంఐ కిందకు మార్చుకోలేరు.....

Updated : 17 Oct 2022 11:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖరీదైన క్రెడిట్‌కార్డు (credit card) కొనుగోళ్లను సులభ వాయిదా (EMI)ల కిందకు మార్చుకోవడం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. బిల్లు మొత్తాన్ని లేదా కొన్ని కొనుగోళ్లను ఈఎంఐ (EMI)లుగా మార్చుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. కొంత పరిమితి దాటిన కొనుగోళ్లను ఈఎంఐ (EMI) కిందకు మార్చుకోవచ్చు. తక్కువ వడ్డీరేటుతో కావాల్సిన గడవులోగా తీర్చే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు. కొంత మంది క్రెడిట్‌ కార్డు (credit card) బిల్లును సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లోనూ దాన్ని వాయిదాల కిందకు మార్చుకుంటుంటారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ప్రయాణ ఖర్చులు, దుస్తులు, లైఫ్‌స్టైల్‌, బీమా ఇలా ఎలాంటి ఖర్చులనైనా ఈఎంఐ కిందకు మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ వసతిని ఉపయోగించుకుంటుంటారు. కానీ, కింద తెలిపిన సందర్భాల్లో మాత్రం క్రెడిట్‌ కార్డు (credit card) కొనుగోళ్లను ఈఎంఐ (EMI) కిందకు మార్చుకోలేరు.

✍ క్రెడిట్‌ కార్డు (credit card) ద్వారా చేసిన బంగారం, ఇతర ఆభరణాల కొనుగోళ్లను ఈఎంఐగా మార్చొద్దని బ్యాంకులు సహా ఇతర క్రెడిట్‌కార్డు జారీదారులకు ఆర్‌బీఐ 2013లో ఆదేశించింది. పసిడి రిటైల్‌ కొనుగోళ్లను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతుకుముందు బంగారం, వజ్రాభరణాల కొనుగోళ్లను చాలా బ్యాంకులు ఈఎంఐ కిందకు మార్చాయి. 2018లో మరోసారి ఆర్‌బీఐ ఈ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే ఆభరణాల చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐగా మార్చొద్దని తేల్చి చెప్పింది.

✍ కొన్ని బ్యాంకులు పాత కొనుగోళ్లు అంటే.. వస్తువు కొని ఓ నిర్దిష్టకాలం గడిచిన తర్వాత వాటిని ఈఎంఐ కిందకు మార్చుకోవడానికి అనుమతించడం లేదు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. కొనుగోళ్లు చేసిన 60 రోజుల తర్వాత ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని బ్యాంకులు నెలరోజులు దాటిన లావాదేవీలను కూడా వాయిదాగా మార్చుకునే వెసులుబాటు కల్పించడం లేదు.

✍ క్రెడిట్‌ కార్డు (credit card)తో చేసే ఇంధన చెల్లింపులు, నగదు లావాదేవీలను సైతం ఈఎంఐగా మార్చుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని