పెట్టుబడి పెట్టడానికి ముందు రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోవడం ముఖ్యం

పెట్టుబడి పెట్టడానికి ముందు మదుపరులు తమ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోవడం చాలా ముఖ్యం......

Published : 25 Dec 2020 16:28 IST

పెట్టుబడి పెట్టడానికి ముందు మదుపరులు తమ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పెట్టుబడి పధకాన్ని ఎంచుకునే ముందు దాని అనుకూలతను నిర్ణయించడంలో పెట్టుబడిదారుడి రిస్క్ ప్రొఫైల్ ఒక ముఖ్యమైన అంశం. రిస్క్ తీసుకునే సామర్థ్యం లెక్కిచ్చేందుకు పెట్టుబడిదారుడి వయసు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం,రాబడులను అర్థం చేసుకోవడం, సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

పెట్టుబడి పధకం అనుకూలతను నిర్ణయించడంలో పెట్టుబడిదారుడి రిస్క్ ప్రొఫైల్ ఒక ముఖ్యమైన అంశం. దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి-రిస్క్ తీసుకునే సామర్థ్యం, సుముఖత. రిస్క్ ప్రొఫైలింగ్ ప్రశ్నాపత్రాలు సాధారణంగా పెట్టుబడి పధకాన్ని సూచించే ముందు రిస్క్ పట్ల పెట్టుబడిదారుడి వైఖరిని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.

సాధారణంగా, సురక్షితమైన ఆదాయాన్ని కలిగి ఉన్న యువ పెట్టుబడిదారుడు దీర్ఘకాలిక లక్ష్యం కోసం ఎక్కువ రిస్క్ తీసుకోగలడు. అదే పెట్టుబడిదారుడు సమీప-కాల లక్ష్యం కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. తదనుగుణంగా, పెట్టుబడి ఎంపిక భిన్నంగా ఉంటుంది. రిస్క్ తీసుకునే సుముఖతను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకోగలిగినప్పటికీ కొన్ని సందర్భాలలో అధిక స్థాయి రిస్క్‌తో అసౌకర్యంగా ఉండవచ్చు. సాధారణంగా వయసు ఎక్కువ ఉన్న మదుపరులు అధిక రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా ఉండకపోవచ్చు.

అనువైన పెట్టుబ‌డి సాధ‌నం : మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి స‌రిపోయే పెట్టుబ‌డి సాధ‌నాన్ని ఎంచుకోవాలి. త‌క్కువ న‌ష్ట భ‌యం ఉన్న వారు స్థిరాదాయ ప‌థ‌కాల్లో మ‌దుపుచేయ‌డం మంచిది. నష్టాన్ని త‌ట్టుకునే వారు ఈక్విటీ సంబంధిత ప‌థ‌కాల్లో మ‌దుపుచేయోచ్చు. స‌రైన పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోక‌పోతే న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

వ‌య‌సు : పెట్టుబ‌డుల విష‌యంలో మ‌దుప‌ర్ల వ‌య‌సు చాలా ముఖ్య‌మైన‌ది. న‌ష్టాన్ని భ‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం వ‌య‌సుతో ముడిప‌డి ఉంటుంది. యుక్త వ‌య‌సులో ఉండే వారు కొంచెం న‌ష్ట‌భ‌యం ఎక్కువున్న వాటిలో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు. ఎందుకంటే ఒక వేళ న‌ష్టం వ‌చ్చినా తిరిగి స‌ంపాదించేందుకు వారికి అవ‌కాశం వ‌య‌సు ఉంటాయి. అదే ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన‌ వారు లేదా మ‌ధ్య‌వ‌య‌స్కులు న‌ష్ట‌భ‌యం త‌క్కువున్న సాధానాలు ఎంచుకోవ‌డం మంచిది. వీరికి న‌ష్టం వ‌స్తే తిరిగి సంపాదించుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు : మదుపుచేసే ముందు కుటుంబ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌న‌పై ఆధార‌ప‌డే వారు ఉంటే న‌ష్ట భ‌యం త‌క్కువ‌గా ఉన్న సాధ‌నాల‌ను ఎంచుకోవాలి. పెళ్లి కాక ముందు యువ‌కులుగా ఉన్న‌పుడు , ఆర్థిక అవ‌స‌ర‌రాలు త‌క్కువ‌గా ఉన్న‌పుడు కొంత న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు.

కాల‌వ్య‌వ‌ధి: పెట్టుబడి లక్ష్యాలు,భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాన్ని సాధించే కాలవ్యవధి పెట్టుబడిదారుపై ప్రభావం చూపించే అంశాలు. కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే అంత నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. పెట్టుబడుల్లోఒడిదుడుకులను సమన్వయపర్చుకోవచ్చు. పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని