Insurance With ATM Card: మీ ఏటీఎం కార్డుతోనే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌!

Insurance With ATM Card: ఏటీఎం కార్డుతో ప్రమాద బీమా లభిస్తుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి.

Updated : 19 Feb 2023 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటీఎం వల్ల ఉన్న ప్రయోజనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చాలా మందికి తెలియని ఉపయోగం ఒకటి ఉంది. అదే ప్రమాద బీమా (Accidental Insurance Cover). చాలా వరకు బ్యాంకులు ఏటీఎం (ATM)తో పాటు అదనపు ప్రయోజనం కింద ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ సహా దాదాపు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు డెబిట్‌ కార్డు (Debit Card)తో పాటే ప్రమాద బీమా (Accidental Insurance Cover) సదుపాయాన్ని ఇస్తున్నాయి. బ్యాంకు, కార్డు రకాన్ని బట్టి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు బీమా కవర్‌ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రమాద బీమాను కూడా కల్పిస్తున్నాయి. ఒకవేళ కార్డుదారునికి ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే సంబంధింత పత్రాలతో బ్యాంకును సంప్రదించి బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ప్రమాదవశాత్తూ మరణిస్తే క్లెయిం దరఖాస్తుకు డెత్‌ సర్టిఫికెట్‌, శవపరీక్ష నివేదికను జత చేయాల్సి ఉంటుంది. ప్రమాద బీమా (Accidental Insurance Cover)తో పాటు కొన్ని బ్యాంకులు ‘పర్చేజ్‌ ప్రొటెక్షన్‌’ను కూడా అందిస్తున్నాయి. అంటే షాపింగ్‌ చేసేటప్పుడు జరిగే మోసపూరిత లావాదేవీలపై కూడా బీమా పొందొచ్చు.

అయితే, డెబిట్‌ కార్డుపై బీమా క్లెయిం చేసుకోవాలంటే ఒక షరతు ఉంటుంది. కార్డుదారుడు ప్రమాదానికి గురి కావడం లేదా చనిపోవడానికి ముందు 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా కార్డుని ఉపయోగించి ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు 60, 90 రోజుల వరకు ఉంది.

ఎస్‌బీఐ గోల్డ్‌ (మాస్టర్‌ కార్డ్‌/వీసా) కార్డుపై రూ.రెండు లక్షల ప్రమాద బీమా ఉంది. ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్‌ కార్డుపై గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా హామీ లభిస్తోంది. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ప్లాటినం డెబిట్‌ కార్డ్‌పై రూ.5 లక్షల బీమా అందజేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వీసా ప్లాటినం డెబిట్‌ కార్డుపై రూ.50,000 బీమా అందిస్తోంది. గరిష్ఠంగా టైటానియం కార్డుపై రూ.10 లక్షల బీమా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని