Budget 2023: నవ భారతానికి ‘యువ’ నైపుణ్యం.. బడ్జెట్‌లో ‘యూత్ పవర్’
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 (Budget 2023)లో ‘యూత్ పవర్’ పేరుతో దేశ యువతకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ రంగాల్లో వారి నైపుణ్యాలను పెంపొందించే (Skilling) కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.
దిల్లీ: దేశ యువతకు సాధికారత కల్పించడంతోపాటు వారి స్వప్నాలను సాకారం చేసుకునేందుకు పూర్తి సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. ఇందుకోసం తాజా బడ్జెట్ (Budget 2023)లో యూత్ పవర్ (Youth Power)కు అధిక ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని రూపొందించామని.. తాజాగా వారి నైపుణ్యాల వృద్ధిపైనా (Skilling) దృష్టి కేంద్రీకరించామన్నారు. ముఖ్యంగా ఉద్యోగ సృష్టి, వ్యాపార అవకాశాలను పెంపొందించే ఆర్థిక విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.
పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0
మూడేళ్లలో లక్షల మంది యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (PMKVY)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగ ప్రాంగణంలోనే శిక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యం, ఆయా రంగాలకు అవసరమైన కోర్సులను తీసుకురావడం వంటివి ఇందులో ఉంటాయన్నారు. ముఖ్యంగా కోడింగ్, కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐఓటీ (IOT), 3డీ ప్రింటింగ్, డ్రోన్లు, సాఫ్ట్ స్కిల్స్ వంటి కొత్తతరం (Industy 4.0) పరిశ్రమలకు అవసరమైన కోర్సులు ఇందులో ఉంటాయని చెప్పారు. దేశ యువత అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డిజిటల్‌గా ‘స్కిల్ ఇండియా’
వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్కిల్ ఇండియా (Skill India) కార్యక్రమాన్ని ఇక నుంచి డిజిటల్ వేదికగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిమాండు ఆధారిత నైపుణ్యాలను అందివ్వడం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం, కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు యువతకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటివి ఇందులో ఉంటాయని తెలిపారు.
47లక్షల మందికి స్టైపెండ్
మూడేళ్లలో దేశవ్యాప్తంగా 47లక్షల మంది యువతీ, యువకులకు ఉపకారవేతనాలు (Stipend) అందించేందుకు గాను నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో ప్రకటించారు. వీరికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ కింద నగదు పంపిణీ చేస్తామన్నారు.
50 పర్యాటక కేంద్రాలే లక్ష్యంగా ‘దేఖో అప్నా దేశ్’
దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు గాను ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమంలో 50 పర్యాటక కేంద్రాలను సమగ్ర, వినూత్న విధానంలో గుర్తించి ప్రమోట్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీటిని భౌతికంగా, వర్చువల్‌గా అనుసంధానం చేయడంతోపాటు టూరిస్టు గైడ్‌లు, పర్యాటకుల భద్రత, ఆ ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన ఆహార కేంద్రాల (Food Streets)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవన్నీ ప్రత్యేక యాప్‌లో పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి పర్యాటక కేంద్రాన్ని ఒక పూర్తి ప్యాకేజీగా రూపొందిస్తామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని వీటిని అభివృద్ధి చేస్తామన్నారు.
‘దేఖో అప్నా దేశ్’ లక్ష్యాలను సాధించేందుకు గాను యువతలో ఆయా రంగాల్లో నైపుణ్యాలు, వ్యాపార మెలకువలను సంయుక్తంగా పెంపొందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటకం కంటే దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచన మేరకు దీన్ని మొదలుపెడుతున్నామని తెలిపారు. ‘స్వదేశ్ దర్శన్ స్కీమ్’తో పాటు సరిహద్దు గ్రామాల్లోనూ పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
యూనిటీ మాల్..
దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా తయారు చేసే వస్తువులకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు వాటి అమ్మకాలు జరిపేందుకు వీలుగా ఆయా రాష్ట్ర రాజధానిలో లేదా ప్రముఖ పర్యాటక కేంద్రంలో యూనిటీ మాల్ (Unity Mall)ను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఓడీఓపీ (వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రాడక్ట్), భౌగోళికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తుల (GI Products)పై దృష్టి పెట్టాలన్నారు. ఇలా భిన్న విధాలుగా దేశ యువతకు నైపుణ్యాలు కల్పించడంతోపాటు వారికి వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా