YouTube: వీడియో ఎక్కడిదైనా.. నచ్చిన ఆడియోతో చూడొచ్చు!

కంటెంట్ క్రియేటర్ల (Content Creators) కోసం యూట్యూబ్‌ (YouTube) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇతర భాషల వీడియోలను సైతం తమకు నచ్చిన ఆడియోతో చూడొచ్చు. 

Published : 25 Feb 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌ (YouTube)లో ఏదైనా వీడియో నచ్చితే దాన్ని ఇతరులకు షేర్‌ చేస్తాం. కొన్నిసార్లు అందులోని ఆడియో ఇతర భాషలో ఉంటే అవతలి వ్యక్తికి అర్థంకాదు. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. మల్టీ-లాంగ్వేజ్‌ (Multi-Language) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో కంటెంట్‌ క్రియేటర్లు (Content Creators) తమ వీడియోలకు వేర్వేరు భాషలలో ఆడియోను యాడ్ చేయొచ్చు. దీనివల్ల యూజర్లు ఇతర భాషల్లో తమకు నచ్చిన వీడియోలోని సమాచారాన్ని సులువుగా అర్థం చేసుకోగలరని యూట్యూబ్‌ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు, సెట్టింగ్స్‌లోకి వెళితే ఆడియో ట్రాక్‌ (Audio Track) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో యూజర్‌ తనకు నచ్చిన భాషను ఎంపిక చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. వీడియోకు ప్రాథమికంగా ఏ ఆడియో ఉండాలనేది కంటెంట్‌ క్రియేటర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మొబైల్, డెస్క్‌టాప్‌, ట్యాబ్‌, టీవీ యూట్యూబ్‌ వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ రానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని, త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం పరిచయం చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందనేది మాత్రం వెల్లడించలేదు. మిస్టర్‌ బీస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వెల్లడించిన దాని ప్రకారం సుమారు 40కి పైగా భాషలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని