EV: యూలు- బజాజ్‌ ఆటో నుంచి రెండు కొత్త విద్యుత్‌ వాహనాలు

ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాలను అద్దెకు అందించే యూలూ, బజాజ్‌ ఆటోకలిసి రెండు విద్యుత్‌ వాహనాలను విడుదల చేశాయి. సాధారణ ప్రయాణాలకు, డెలివరీ ఏజెంట్ల అవసరాలను ఇవి తీర్చనున్నాయి.

Published : 27 Feb 2023 20:00 IST

ముంబయి: అద్దెకు విద్యుత్‌ వాహనాలు అందించే బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ యూలూ (Yulu), ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj Auto) సంయుక్తంగా రెండు విద్యుత్‌ వాహనాలను విడుదల చేశాయి. మిరాకిల్‌ జీఆర్‌ (Miracle GR), డీఈఎక్స్‌ జీఆర్‌ (DeX GR) పేరిట వీటిని తీసుకొచ్చాయి. సాధారణ ప్రయాణాలకు, డెలివరీ ఏజెంట్లకు ఉపయుక్తంగా ఉండేందుకు వీలుగా వీటిని రూపొందించారు. వినియోగదారుల అవసరాలు, రహదారులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దారు.

బజాజ్‌కు చెందిన బజాజ్‌ చేతక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఈ వాహనాలను తీసుకొచ్చింది. బజాజ్‌ ఆటో వీటిని తయారు చేస్తుంది. యూలూ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు యూలూ ఓ ప్రకటనలో తెలిపింది. వాహన అవసరాలు, వినియోగదారులు అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని, దీంతో సంప్రదాయ యాజమాన్య నమూనాలు విఫలమవుతున్న నేపథ్యంలో బజాజ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు యూలూ సీఈఓ అమిత్‌ గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో తమ వాహన సంఖ్యను రెట్టింపు చేశామని, ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఏడాది చివరి నాటికి తమ ఆదాయాన్ని సైతం 10 రెట్లు పెంచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ఎలక్ట్రిక్‌ అనేది తమ వ్యూహాత్మక ప్రాధాన్యాల్లో ఒకటని, అందులో యూలూ ఒక భాగస్వామి అని బజాజ్‌ ఆటో చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎస్‌ రవికుమార్‌ తెలిపారు.

యూలూ స్కూటర్లు స్వాపబుల్‌ బ్యాటరీలతో నడుస్తాయి. ఇందుకోసం యుమా ఎనర్జీ స్టేషన్లు నెలకొల్పారు. బెంగళూరు, ముంబయి, దిల్లీలో ఈ తరహా 100 స్టేషన్లు ఉన్నాయి. 2024 నాటికి ఈ సంఖ్యను 500కు పెంచాలని యూలూ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వాహనాలు కావాల్సిన వారు సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దగ్గర్లోని యూలూ సెంటర్‌కు వెళ్లి బైక్‌ను రెంట్‌కు తీసుకోవచ్చు. వాహనం బట్టి ధరలు ఉంటాయి. మన అవసరాలు పూర్తయ్యాక మళ్లీ దగ్గర్లోని యూలూ కేంద్రాల్లో వాహనాలను అప్పగించాలి. దీర్ఘకాలం పాటు కూడా వాహనాలను రెంట్‌కు తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు