Term insurance: ఖర్చు లేకుండానే టర్మ్‌ ఇన్సూరెన్స్‌..తీసుకుంటారా మరి?

Term insurance: మార్కెట్‌లో ఇప్పటి వరకు అందుబాటులో రెండు రకాల టర్మ్‌ ఇన్సూరెన్స్‌లకు భిన్నమైన ప్లాన్‌ మార్కెట్లోకి వచ్చింది...

Published : 18 Aug 2022 11:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటివరకు మార్కెట్‌లో రెండు రకాల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పాలసీ కాలపరిమితి ముగిసేలోపు బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ జీవించి ఉంటే చెల్లించిన ప్రీమియంలు మాత్రం తిరిగి రావు. మరొకటి ‘రిటర్న్‌-ఆఫ్‌-ప్రీమియం (RoP) టర్మ్‌ ప్లాన్‌’. దీంట్లో పాలసీ గడువు ముగిసే వరకు వ్యక్తి జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం తిరిగొస్తుంది. అయితే, దీంట్లో ప్రీమియం మొదటిదానితో పోలిస్తే రెండింతలుగా ఉంటుంది. 

తాజాగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో మూడో రకం కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్నే మార్కెట్‌లో ‘జీరో-కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌’గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాక్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలయన్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈ ప్లాన్‌ను అందిస్తున్నాయి. త్వరలో మరికొన్ని సంస్థలు కూడా దీన్ని ప్రారంభించే యోచనలో ఉన్నాయి.

మధ్యలోనే నిష్క్రమించొచ్చు..

మ్యాక్స్‌లైఫ్‌ దీన్ని ‘స్పెషల్‌ ఎగ్జిట్‌ వాల్యూ’గా పేర్కొంటోంది. స్మార్ట్‌ సెక్యూర్‌ ప్లాన్‌లో భాగంగా దీన్ని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో పాలసీదారులు ఒక నిర్దిష్ట కాలపరిమితి తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అయితే, 35-40 ఏళ్ల దీర్ఘకాల ప్లాన్‌ను తీసుకుంటేనే మధ్యలో నిష్క్రమించే వెసులుబాటు లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన తర్వాత 25వ సంవత్సరంలో ప్లాన్‌ నుంచి వైదొలిగే అవకాశం ఇస్తారు. లేదా 65 ఏళ్ల వయసులోనైనా నిష్క్రమించవచ్చు. ఒకవేళ పాలసీ వ్యవధి 45 ఏళ్లయితే.. ప్లాన్‌ నుంచి బయటకొచ్చేందుకు 30 ఏళ్లు ఆగాలి.

ఇందుకే ఇది ‘జీరో-కాస్ట్‌ ప్లాన్‌’..

పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి రాబడి ఉండదని చాలా మంది టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి వెనకాడుతుంటారు.  అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే మూడో రకం ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్‌ తీసుకున్నవాళ్లు ఒకవేళ నిర్ణీత సంవత్సరంలో నిష్క్రమిస్తే అప్పటి వరకు కట్టిన ప్రీమియంలన్నీ తిరిగొస్తాయి. అంటే ఎలాంటి ఖర్చు లేకుండానే అప్పటి వరకు బీమా ప్రయోజనాన్ని పొందారన్నమాట! అందుకే దీన్ని జీరో-కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌గా పేర్కొన్నారు. పాలసీ తీసుకునేటప్పుడు చాలా మంది 75-80 ఏళ్ల వయసు వచ్చే వరకు తమకు టర్మ్‌ ప్లాన్‌ ఉండాలని ఆశించి తీసుకుంటారు. కానీ, కొంత కాలం గడిచిన తర్వాత దానిపై ఆసక్తి ఉండదు. లేదా మార్కెట్‌లోకి మరింత ఆకర్షణీయమైన ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చి ఉండొచ్చు. అందుకే నిష్క్రమణ ఆప్షన్‌ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదీ అప్పటి వరకు కట్టిన ప్రీమియంలన్నీ తిరిగి రావడం మరింత ప్రయోజనకరం.

ఎవరు తీసుకోవచ్చంటే..

ప్రతిఒక్కరికీ సాధారణ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. తక్కువ ప్రీమియంతో, ఆన్‌లైన్‌లో, 60 ఏళ్ల వయసు వరకు పాలసీ ఉండేలా తీసుకోవాలని చెబుతుంటారు. కానీ, 55 ఏళ్ల వయసు వచ్చే సరికే ఓ వ్యక్తి ఆర్థికపరమైన లక్ష్యాలన్నీ నెరవేరాయనుకుందాం. అలాగే తదుపరి జీవితానికి కావాల్సిన సంపదను కూడా పోగు చేసుకున్నారనుకోండి. అప్పుడు ఇంకా టర్మ్‌ ప్లాన్‌ కొనసాగించడంలో ఉపయోగమేంటని చాలా మంది ఆలోచిస్తుంటారు. పైగా ప్రీమియంలు తిరిగి చెల్లించే పాలసీల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మరి తక్కువ ప్రీమియంతో, కావాల్సినప్పుడు బయటకొచ్చే అవకాశం ఉన్న ప్లాన్‌ను కోరుకునేవారిని ఈ జీరో-కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని