Car Insurance: జీరో డిప్రిసియేషన్ క‌వ‌ర్ ఎందుకు కొనుగోలు చేయాలి?

కొత్త‌గా కారు కొనుగోలు చేసిన వారు స‌మ‌గ్ర బీమాతో పాటు జీరో డిప్రిసియేష‌న్ యాడ్‌-ఆన్‌ను కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 

Updated : 23 Nov 2022 10:14 IST

వాహ‌నానికి భ‌ద్ర‌త ఉండాలంటే బీమా ఉండాల్సిందే. అనుకోని ప్ర‌మాదాలు, ప్ర‌కృతి వైప‌రీత్యాల భారిన ప‌డిన‌ప్పుడు వాహ‌నం దెబ్బ‌తింటుంది. ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డానికి వాహ‌న బీమా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అయితే వాహ‌నం ఏదైనా ప్ర‌మాదం కార‌ణంగా దెబ్బ‌తిన్న‌ప్పుడు స‌మ‌గ్ర బీమాతో పూర్తి నష్టం క‌వ‌ర్ అవుతుందా అంటే .. కాద‌నే చెప్పాలి. ఎందుకంటే కారు అనేది త‌రుగుద‌ల ఆస్తి. కాలం గ‌డుస్తున్న కొద్ది దాని విలువ త‌గ్గుతుంది. అందువ‌ల్ల స‌మ‌గ్ర బీమా తీసుకున్న‌ప్ప‌టికీ కారు ఐడీవీ (ఐడీవీ అంటే ఇన్సూర్డ్ డిక్లేర్ వేల్యూ) ప్ర‌కార‌మే బీమా చెల్లిస్తారు.  దెబ్బ‌తిన్న కారు త‌రుగుద‌ల విలువ‌ను తీసివేసి ప్ర‌స్తుత ఉన్న మార్కెట్ విలువ ప్ర‌కార‌మే బీమా చెల్లిస్తారు. 

జీరో డిప్రిసియేష‌న్..  చాలా మంది దీనిని బంపర్ టూ బంపర్ బీమా, నిల్ డిప్రిసియేష‌న్ క‌వ‌ర్ అని కూడా పిలుస్తారు. పాల‌సీదారులు జీరో డిప్రియేష‌న్‌ను యాడ్‌-ఆన్‌కి జోడించ‌డం వ‌ల్ల‌ ఏదైనా ప్ర‌మాదం వ‌ల్ల కారు విడి భాగాలు దెబ్బ‌తింటే క్లెయిమ్ స‌మ‌యంలో సంబంధిత‌ త‌రుగుద‌లను డిడ‌క్ట్ చేయ‌కుండా మొత్తం విలువ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. దీంతో క్లెయిమ్ మొత్తాన్ని పూర్తిగా పొందే వీలుంటుంది.  

ఉదాహ‌ర‌ణ‌కి, ర‌మేష్‌ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడని అనుకుందాం. అతని కారుకి చాలా నష్టం వాటిల్లింది. కారును రిపేర్ చేయడానికి సుమారు రూ. 1. 5 లక్షలు వరకు ఖర్చవుతుందని షో రూమ్ ప్రతినిధులు తెలిపారు. అప్పుడు రమేష్ బీమా క్లెయిమ్ చేసుకోవాలని భావించి, బీమా సంస్థను సంప్రదిస్తాడు. అయితే, బీమా సంస్థ కేవలం రూ. 1 లక్ష మాత్రమే చెల్లించడానికి అంగీకరిస్తుంది. బీమా సంస్థ క్లెయిమ్ మొత్తం నుంచి, డిప్రిసియేషన్ కింద రూ. 50,000 తీసివేసింది, కాబట్టి మిగిలిన మొత్తాన్ని రమేష్ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే రమేష్ కాంప్రహెన్సివ్(సమగ్ర) బీమాను కలిగి ఉన్నాడు. జీరో డిప్రిసియేషన్ బీమాను కొనుగోలు చేసి ఉంటే పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే వీలుండేది. 

జీరో డిప్రిసియేషన్ పాలసీ కొత్త కార్ల‌కు, లేదా నాలుగు సంవ‌త్స‌రాల లోపు కార్ల‌కు అందుబాటులో ఉంటుంది. అందువ‌ల్ల కారు కొన్న ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత జీరో డిప్రియేష‌న్ బీమాను తీసుకోవ‌డం కొంచెం క‌ష్టంతో కూడుకున్న విష‌యం. 10 సంవత్సరాలు దాటిన కారుకు జీరో డిప్రిసియేషన్ బీమాను కొనుగోలు చేయడం కుదరదు.

జీరో డిప్రిసియేష‌న్ వ‌ల్ల‌ ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే.. మీ సొంత డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. వాహన విడి భాగాల కవరేజ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని