Nithin Kamath: ఏఐ కారణంగా ఉద్యోగుల్ని తొలగించం: జెరోదా సీఈవో

జెరోదా (Zerodha) సీఈవో నితిన్‌ కామత్‌ (Nithin Kamath) ఏఐ, ఉద్యోగుల తొలగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ కార్యకలాపాల్లో కూడా త్వరలో ఏఐ సాంకేతికతను పరిచయం చేస్తామని తెలిపారు.

Published : 12 May 2023 20:47 IST

బెంగళూరు: గత కొంత కాలంగా కృత్రిమ మేధ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్‌ మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. మరోవైపు పలువురు ఐటీ రంగ నిపుణులు ఉద్యోగులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జెరోదా (Zerodha) సీఈవో నితిన్‌ కామత్‌ (Nithin Kamath) ఏఐ, ఉద్యోగుల తొలగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ కార్యకలాపాల్లో కూడా ఏఐ సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు. అయితే, ఏఐ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సంస్థలో ఏఐ వినియోగానికి సంబంధించి కొత్త విధివిధానాలను రూపొందించినట్లు ట్వీట్‌ చేశారు. 

‘‘జెరోదాలో ఏఐ పాలసీని పరిచయం చేస్తున్నాం. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొత్త సాంకేతికత కారణంగా ఉద్యోగుల్ని తొలగించం. 2021లో అందరు ఏఐ గురించి చర్చిస్తున్న సమయంలో దాంతో ఎలాంటి ఉపయోగంలేదని భావించాం. కానీ, ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికత కారణంగా చోటుచేసుకుంటున్న మార్పులను అంగీకరిస్తున్నాం. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఏఐపై నింద వేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు ఏఐ సాయంతో భారీగా లాభాలు ఆర్జించి తమ వాటాదారులను ధనవంతులను చేస్తాయి. ఇది సమాజంలో భారీ అసమానతలకు కారణమవుతుంది. మానవీయ కోణంలో ఇది ఏ మాత్రం మంచిది కాదు’’ అని నితిన్‌ అభిప్రాయపడ్డారు.

ఏఐ వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పరిమితులు విధించాలని కోరారు. ఏఐ కారణంగా ఒక దేశం శక్తివంతంగా మారితే.. మరో దేశం చూస్తూ ఊరుకోదని అన్నారు. అలా ప్రపంచంలోని దేశాలు, వ్యాపార సంస్థలు, మనుషుల మధ్య అసమానతలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏఐ పూర్తిస్థాయి ప్రభావాన్ని చూసేందుకు మరికొన్నేళ్లు సమయం పడుతుందని అభిప్రాపయపడ్డారు. ఒక స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థ సీఈవో నుంచి ఇలాంటి అభిప్రాయం వ్యక్తం కావడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు