Zilingo CEO Ankiti Bose: సీఈఓ అంకితి బోస్‌ను తొలగించిన జిలింగో

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్యాషన్‌ టెక్నాలజీ అంకుర సంస్థ జిలింగో.. భారత సంతతికి చెందిన సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ అంకితి బోస్‌ను సంస్థ నుంచి తొలగించింది.....

Published : 20 May 2022 14:13 IST

దిల్లీ: సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్యాషన్‌ టెక్నాలజీ అంకుర సంస్థ జిలింగో.. భారత సంతతికి చెందిన సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ అంకితి బోస్‌ను సంస్థ నుంచి తొలగించింది. ఆమె ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడమే ఇందుకు కారణమని వివరించింది.

అంకితి బోస్ పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మార్చి 31న జిలింగో ఆమెను సస్పెండ్‌ చేసింది. అనంతరం స్వతంత్ర ఫోరెన్సిక్‌ సంస్థలతో దర్యాప్తు జరిపించింది. విచారణలో ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, అంకితి బోస్‌ పాల్పడిన అవకతవకలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.

తనని సంస్థలో వేధింపులకు గురిచేస్తున్నారని ఏప్రిల్‌ 11న తొలిసారి అంకితి బోస్‌ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన దర్యాప్తు సంస్థ స్పందిస్తూ.. ‘‘సస్పెండ్‌ అయిన తర్వాతే ఈ ఆరోపణలు తెరమీదకు వచ్చాయి’’ అని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లుగా ఈ వేధింపుల ఫిర్యాదుల నుంచి తప్పించుకోవడానికే కంపెనీ ఆమెను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

ఈ-కామర్స్‌ సంస్థగా ప్రారంభమైన జిలింగో తక్కువ సమయంలోనే దుస్తుల పరిశ్రమ, ఫైనాన్సింగ్‌ సహా మరిన్ని టెక్‌ ఆధారిత సేవల గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌లో భాగమైంది. ప్రస్తుతం ఈ సంస్థలో 600కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2019లో వివిధ కంపెనీల నుంచి 226 మిలియన్‌ డాలర్ల నిధుల్ని సమీకరించింది. దీంతో కంపెనీ విలువ ఒక బిలియన్‌ డాలర్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని