Zomato share price: జొమాటో షేరు పతనం.. నష్ట నివారణ చర్యలకు దిగిన కంపెనీ

తమ కంపెనీ షేర్ల పతనాన్ని అడ్డుకునేందుకు జొమాటో నష్టనివారణ చర్యలు చేపట్టింది....

Updated : 27 Jul 2022 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ కంపెనీ షేర్ల పతనాన్ని అడ్డుకునేందుకు జొమాటో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు ఈఎస్‌ఓపీ (employee stock option plan) నుంచి రూ.1 విలువ వద్ద 4.66 కోట్ల షేర్లను కేటాయించింది. ఈ మేరకు జులై 26న ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇందుకు తమ ‘బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల’లోని ‘నామినేషన్‌, రెమ్యునరేషన్‌ కమిటీ’ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ప్రస్తుత ధర వద్ద ఉద్యోగులకు తాజాగా కేటాయించిన షేర్ల విలువ రూ.193 కోట్లు. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు కాస్త కోలుకున్నాయి. చివరకు ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.52 శాతం మేర లాభపడి రూ.43.95 వద్ద స్థిరపడింది.

ఏడాది పాటు లాక్‌-ఇన్‌ పీరియడ్‌లో కొనసాగిన 613 కోట్ల షేర్లను (మొత్తం షేర్లలో 77.87 శాతం) విక్రయించుకునే గడువు రావడంతో కంపెనీ షేర్లు గత రెండు రోజుల్లో దాదాపు 23 శాతం కుదేలయ్యాయి. గత ఏడాది నవంబరులో నమోదైన జీవితకాల గరిష్ఠం రూ.169.10 నుంచి ఈ షేరు ఇప్పటి వరకు 74 శాతం కుంగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి 66 శాతం దిగజారింది. పబ్లిక్‌ ఇష్యూలో రూ.76 చొప్పున జొమాటో షేర్లు కేటాయించారు. 2021 జులై 23న షేరు 51 శాతం ప్రీమియంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.115 వద్ద నమోదైంది. తర్వాత రోజుల్లో షేరు విలువ జీవన కాల గరిష్ఠమైన రూ.169 స్థాయికి చేరడమే కాదు.. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువను  సాధించింది. అక్కడి నుంచి షేరు విలువ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని