Zomato: భారీ కోతల వేళ.. జొమాటో నుంచి ‘కొలువుల’ ప్రకటన..!

ఉద్యోగాల కోతల వేళ.. జొమాటో(Zomato) సంస్థ నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. కొత్త నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. 

Updated : 24 Jan 2023 13:25 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు గూగుల్, అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల్లో కోత పెడుతున్న సమయంలో కాస్త ఊరటనిచ్చే వార్త. తాము ఉద్యోగుల్ని నియమించుకుంటామని ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ప్రకటించడమే అందుకు కారణం. లింక్డిన్(LinkedIn) వేదికగా ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్‌(Deepinder Goyal) పోస్టు పెట్టారు. వివిధ విభాగాల్లో 800 మందిని నియమించుకోనున్నామని ప్రకటించారు.

చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ టు సీఈఓ, జనరలిస్ట్‌, గ్రోత్ మేనేజర్‌, ప్రొడక్ట్‌ ఓనర్‌, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌ వంటి ఉద్యోగాలకు కొత్త వారిని తీసుకోనున్నామని గోయల్ తెలిపారు. ‘ఈ ఐదు విభాగాల్లో 800ల ఖాళీలున్నాయి. వీటికి సరిపోయే నైపుణ్యాలు ఉన్నవారిని ఇక్కడ ట్యాగ్ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం deepinder@zomato.comకు మెయిల్‌ చేయండి’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

అయితే దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రెండు నెలల క్రితం పనితీరు ఆధారంగా మొత్తం సిబ్బందిలో మూడు శాతం మందిని ఈ సంస్థ తొలగించింది. ఇప్పుడు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదొక మార్కెట్ గిమ్మిక్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మాంద్యం భయాల వేళ, పునర్నిర్మాణ చర్యల పేరిట అంతర్జాతీయంగా పలు సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మొత్తంగా ఐటీ రంగంలో గత నెలరోజుల్లోనే సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ప్రముఖ సంస్థలన్నీ వేలల్లోనే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని