Paytm- Zomato: పేటీఎం, జొమాటో, నైకా.. ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీలకేమైంది?

Paytm- Zomato: ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీల షేర్ల విలువ రికార్డు గరిష్ఠాల నుంచి పాతాళానికి చేరాయి. లక్ష కోట్ల విలువ దాదాపు సగానికి పడిపోయింది.

Published : 09 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది 2021.. స్టాక్‌ మార్కెట్‌పై పెద్దగా అవగాహన లేని వారు కూడా దలాల్‌ స్ట్రీట్‌పై ఓసారి కన్నేసేలా చేసిన రోజులవి. కారణం వరుస ఐపీఓలు. ఆ ఏడాది చాలా కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చాయి. కొన్ని పేరు మోసిన కంపెనీలకు ఆరంభం నుంచే పెద్ద ఎత్తున ప్రచారం లభించగా.. చిన్న కంపెనీలు మాత్రం లిస్టింగ్‌లో అదరగొట్టి అందరినీ ఆకర్షించాయి. అలాంటి వాటిలో పేటీఎం, జొమాటో, నైకా ముఖ్యమైనవి. పేటీఎం, జొమాటో సామాన్య ప్రజానీకానికి ముందు నుంచే తెలిసినవి కాగా.. సైలెంట్‌గా వచ్చిన నైకా మాత్రం లిస్టయిన తొలి రోజే మార్కెట్‌ విలువ పరంగా లక్ష కోట్లు దాటి రికార్డు సృష్టించింది. కానీ ఇప్పుడు ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీల షేర్ల విలువ రికార్డు గరిష్ఠాల నుంచి పాతాళానికి చేరాయి. లక్ష కోట్ల విలువ దాదాపు సగానికి పడిపోయింది.


 

జొమాటో పయనం ఎటో..?

ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌గా ప్రజలకు బాగా చేరువైన జొమాటో ఐపీఓకు వస్తుందన్న వార్త సామాన్యులను సైతం మార్కెట్‌ వైపు తిప్పుకొనేలా చేసింది. రూ.76 షేరు విలువకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన జొమాటో 2021 జులై 24న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైనప్పుడు 51.6 శాతం అధికంగా రూ.115కు చేరింది. ఆ రోజు గరిష్ఠంగా రూ.138కి చేరిన షేరు, చివరకు రూ.125.85 వద్ద ముగిసింది. తొలిరోజు రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువను అధిగమించడంతో పాటు అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన 50 సంస్థల జాబితాలోనూ చేరింది. నవంబర్‌ 16న కంపెనీ షేరు విలువ అత్యధికంగా రూ.169 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాతే కథ మొదలైంది. అక్కడి నుంచి షేరు విలువ పడుతూ వచ్చింది. మార్కెట్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో జొమాటో ఐపీఓకు వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పడడం మొదలైంది. దీనికి తోడు జొమాటోకు స్విగ్గీ నుంచి గట్టి పోటీ ఉండడమూ మరో కారణం. దీంతో ఎక్కడో రూ.150 స్థాయి నుంచి ఇటీవల రూ.70కి చేరిన సమయంలో బ్లింకిట్‌ను కొనుగోలు చేయడం జొమాటోను మరింత నష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం లిస్టింగ్‌ ధర నుంచి షేరు విలువ దాదాపు సగానికి పైగా పడిపోయింది. శుక్రవారం నాటికి కంపెనీ షేరు విలువ రూ.54.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.41,625 కోట్లకు చేరింది.

పేటీఎం మొదటి నుంచీ అదే కథ

వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ గతేడాది నవంబర్‌ 18న మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.2,150గా నిర్ణయించినప్పటికీ తొలి రోజే నిఫ్టీలో 9 శాతం నష్టంతో రూ.1,950 వద్ద షేరు లిస్టయ్యింది. 1,950 వద్ద ప్రారంభమైన షేరు విలువ ట్రేడింగ్‌ ముగిసే నాటికి 27.34 శాతం క్షీణించి రూ.1562కి పరిమితమైంది. అక్కడి నుంచి ఏ రోజూ పేటీఎం పెద్దగా కోలుకున్న దాఖలాల్లేవు. తొలి రోజే షేర్ల ధర తగ్గినప్పటికీ.. కంపెనీ మార్కెట్‌ విలువ మాత్రం రూ.లక్ష కోట్లు దాటడం విశేషం. అయితే, షేరు విలువను అధికంగా పెట్టడమే పేటీఎం నష్టాలకు కారణమన్నది మార్కెట్‌ నిపుణులు చెప్పేమాట. పేటీఎం ఉన్న వ్యాపారంలో గట్టి పోటీ ఉండడం, లాభదాయకతకు పెద్దగా అవకాశం లేకపోవడంతో కంపెనీ షేరు విలువ పతనానికి ప్రధాన కారణం. దీంతో శుక్రవారం నాటికి కంపెనీ షేరు విలువ రూ.698కి చేరింది. లిస్టింగ్‌ ధరతో పోలిస్తే ఇది 64 శాతం తక్కువ. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.44,821 కోట్లకు చేరింది.

వాటితో పాటే నైకా..

నైకా బ్రాండుపై సౌందర్య ఉత్పత్తులను విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ షేర్లు గతేడాది నవంబర్‌ 10న స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి రోజే అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.1,125 కాగా.. దీనికి 77.86 శాతం అధికంగా రూ.2,001 వద్ద బీఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. అదే జోరు కొనసాగిస్తూ 99.83% పెరిగి రూ.2,248.10కు చేరాయి. చివరకు ఇష్యూ ధర కంటే 96.15% అధికంగా రూ.2,206.70 వద్ద ముగిశాయి. షేర్ల దూకుడుతో బీఎస్‌ఈలో తొలి రోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లకు చేరింది. ఐపీఓలో షేర్లు దక్కించుకున్న మదుపరులకు తొలి రోజే డబుల్‌ లాభాన్ని ఆర్జించి పెట్టిన నైకా.. తర్వాత తిరోగమన బాట పట్టింది. నైకా షేర్ల పతనానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ను తమ బీ2బీ విభాగానికి సీఈఓగా నియమించింది. దీంతో లాభాల వృద్ధిని పణంగా పెట్టి విస్తరణ దిశగా కంపెనీ అడుగులు వేస్తోందన్న సంకేతాలు మార్కెట్‌లోకి వెళ్లాయి. మరోవైపు ప్రీమియం సెగ్మెంట్‌ నుంచి కంపెనీ క్రమంగా సాధారణ కస్టమర్లను ఆకట్టుకునే దిశగా పయనిస్తోందన్న వాదనా వినిపిస్తోంది. దీనివల్ల ప్రీమియం బ్రాండ్‌గా ఉన్న విలువ కాస్తా పడిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికితోడు 2021 మార్కెట్‌ బూమ్‌లో లిస్టయిన టెక్ ఆధారిత కంపెనీల షేర్లన్నీ భారీ ఎత్తున నష్టాలు చవిచూస్తున్నాయి. నైకాను కూడా మదుపర్లు అదే గాటన కట్టి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ రూ.1393 వద్ద ముగిసింది. లిస్టింగ్‌ ధరతో పోలిస్తే ఇది 30.33 శాతం తక్కువ. కంపెనీ మార్కెట్‌ విలువ సైతం రూ.68,925 కోట్లకు చేరింది. ఇలా లక్ష కోట్ల కంపెనీలుగా పేరొందిన ఈ మూడు కంపెనీలే కాదు.. గతేడాది వచ్చిన పాలసీ బజార్‌, మ్యాప్‌ మై ఇండియా, కార్‌ ట్రేడ్‌ కంపెనీ షేర్లు సైతం మదుపరులకు నష్టాన్ని మిగిల్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు