Zomato: సమస్యను పరిష్కరించకపోతేనే రెస్టారెంట్లపై నిషేధం: జొమాటో

కొత్తగా తీసుకువచ్చిన ఆహార నాణ్యతా విధానం ఏకపక్షంగా ఉందన్న రెస్టారెంట్ల ఆందోళనలపై జొమాటో స్పందించింది...

Published : 16 Apr 2022 13:43 IST

దిల్లీ: కొత్తగా తీసుకువచ్చిన ఆహార నాణ్యతా విధానం ఏకపక్షంగా ఉందన్న రెస్టారెంట్ల ఆందోళనలపై జొమాటో స్పందించింది. ఈనెల 18 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ విధానాన్ని మే 3నకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కొత్త విధానంపై జాతీయ రెస్టారెంట్ల సంఘం(ఎన్‌ఆర్‌ఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏప్రిల్‌ 22 వరకు కొత్త విధానంపై తమ అభిప్రాయాలను తెలపాలని రెస్టారెంట్లను జొమాటో కోరింది. 

కొత్త విధానం ప్రకారం అందే ఫిర్యాదులు చాలా తక్కువే ఉండే అవకాశం ఉందని జొమాటో తెలిపింది. అయితే, వీటిని పరిష్కరించకపోతే దీర్ఘకాలంలో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అందిన ఫిర్యాదుల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు కావాల్సిన వ్యవస్థను ఏర్పరచేందుకు రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని తెలిపింది. నిర్దిష్ట సమయంలోగా సరైన పరిష్కారం చూపని రెస్టారెంట్లను మాత్రమే తమ యాప్‌లో తాత్కాలికంగా నిషేధిస్తామని వివరించింది.  

ఇదీ విధానం..

‘ఆహార నాణ్యతపై వినియోగదార్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తాత్కాలికంగా తమ ప్లాట్‌ఫాంలో ఆయా రెస్టారెంట్లను నిషేధిస్తామని’ వివరిస్తూ రెస్టారెంట్లకు జొమాటో ఇ-మెయిళ్లు పంపింది. ఆ రెస్టారెంట్లలోని పదార్థాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి ఉండే థర్డ్‌పార్టీ తనిఖీలను జరిపేంత వరకు ఈ తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని.. ఇందుకయ్యే ఆడిట్‌ ఖర్చు కూడా రెస్టారెంట్లే భరించాలని జొమాటో తెలిపింది. ఫిర్యాదులో నిజమెంతో ఎలా తెలుస్తుందని ఎన్‌ఆర్‌ఏఐ ప్రశ్నిస్తూ కొత్త విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని