Zomato UPI: జొమాటోలోనూ యూపీఐ సేవలు.. ఇక CODకి స్వస్తి?

Zomato UPI: జొమాటో సంస్థ యూపీఐ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై థర్డ్‌ పార్టీ పేమెంట్స్‌ సంస్థలతో సంబంధం లేకుండా యాప్‌లోనే పేమెంట్స్‌ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది.

Updated : 16 May 2023 18:49 IST

Zomato UPI | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato) యూపీఐ (UPI) సేవలను ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు.. గూగుల్‌ పే, ఫోన్‌ పే తరహా థర్డ్‌ పార్టీ యాప్స్‌తో పనిలేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్‌ చేయొచ్చు. ఇందుకోసం యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్లు చాలా మంది యూపీఐ సేవలను వాడుతున్నారని, అందుకే ఐసీఐసీఐ (టెక్నాలజీ పార్టనర్) సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవలను ఎత్తివేయాలన్న ఆలోచనలోనూ జొమాటో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్న సందర్భాల్లో కస్టమర్‌ ఆహారాన్ని తిరస్కరించే అవకాశం ఉన్నందున సీఓడీ విధానానికి స్వస్తి పలకాలని జొమాటో భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎందే మెజారిటీ వాటా. దీంతో ఆయా యాప్స్‌పై అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని ఎన్‌సీపీఐ భావిస్తోంది. అందుకే ఏ ఒక్క కంపెనీ కూడా 30 శాతానికి మించి మార్కెట్‌ వాటా కలిగి ఉండకూడదని నిర్ణయించింది. ఇందుకోసం 2024 డిసెంబర్‌ 31 డెడ్‌లైన్‌గా నిర్దేశించింది. ఈ క్రమంలోనే గూగుల్‌, ఫోన్‌పే వంటి యాప్స్‌పై ఆధారపడడం తగ్గించేందుకు వేర్వేరు సంస్థలకు యూపీఐ సేవలను అందించేందుకు అనుమతి ఇస్తోంది. జొమాటో తరహాలో ఫ్లిప్‌కార్ట్‌ సైతం యూపీఐ సేవలు ప్రారంభించబోతోందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని