Zomato: డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్‌ పాయింట్స్‌’.. జొమాటో నిర్ణయం

Zomato setting up Rest Points: డెలివరీ ఏజెంట్ల కోసం విశ్రాంత గదులు ఏర్పాటు చేయాలని జొమాటో నిర్ణయించింది. ఇతర సంస్థలకు చెందిన ఏజెంట్లూ ఇందులో సేద తీరొచ్చని పేర్కొంది.

Published : 16 Feb 2023 21:19 IST

దిల్లీ: ఎండైనా.. వానైనా.. రాత్రీపగలూ అన్న తేడా లేకుండా ఆహారాన్ని డెలివరీ చేస్తుంటారు ఫుడ్‌ డెలివరీ ఏజెంట్లు (Delivery Agents). ఒకసారి ఆర్డర్లు తీసుకోవడం మొదలు పెడితే.. అయితే బైక్‌ మీదో.. లేదంటే హోటల్‌ బయటనో పడిగాపులు కాస్తుంటారు. మళ్లీ ఇంటికి చేరే వరకు విశ్రాంతన్నదే ఎరుగరు. అలాంటి డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో (Zomato) ముందుకొచ్చింది. ఫుడ్‌ డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్‌ పాయింట్లు’ ఏర్పాటు చేస్తోంది. ఇతర సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు సైతం వీటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్‌ పాయింట్లు నిర్వహిస్తున్నామని, మరిన్ని ఏర్పాటు చేసేందుకు జొమాటో నిర్ణయించిందని గోయల్‌ తెలిపారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌, ఇంటర్నెట్‌ సదుపాయం, ఫస్ట్‌- ఎయిడ్‌, 24×7 హెల్ప్‌డెస్క్‌, మరుగుదొడ్ల సదుపాయం ఉంటుంది. అయితే, ఎక్కడ ఎన్ని పాయింట్లను ఏర్పాటు చేసేదీ వివరాలు వెల్లడించలేదు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులూ తట్టుకుని విధులు నిర్వర్తిస్తున్న ఏజంట్ల సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గిగ్‌ ఎకానమీకి ఊతం ఇవ్వడంతో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్లు తెలిపారు. దీనివల్ల డెలివరీ ఏజెంట్లు శారీరకంగా, మానసికంగా అలసట నుంచి విముక్తి పొందుతారని తెలిపారు.

గిగ్‌ వర్కర్లు అంటే..?

డెలివరీ బాయ్స్‌, కన్సల్టెంట్లు, బ్లాగర్లు వంటి వారు గిగ్‌ ఎకనామీ కిందకు వస్తారు. ఫుడ్‌ డెలివరీ యాప్‌లు సహా రైడ్‌ షేరింగ్‌, ఇంటి వద్ద వ్యక్తిగత సేవలందించే యాప్‌ల్లో పనిచేసే వారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. సంస్థ- ఉద్యోగి అన్న సంప్రదాయ విధానానికి భిన్నంగా ఆదాయం కోసం మాత్రమే సదరు సంస్థ వద్ద పనిచేస్తారు. కానీ వీరెవరూ ఆ సంస్థ ఉద్యోగులు కారు. వీరికి ఎలాంటి సామాజిక భద్రత, గ్రాట్యుటీ, పనివేళలు వర్తించవు. 2020-21 నాటికి దేశంలో దాదాపు 77 లక్షల మంది గిగ్‌ వర్కర్లు పనిచేస్తుండగా.. 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు పెరగనుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని