Zomato share price: భారీగా పతనమైన జొమాటో షేరు.. ఎందుకంటే?

Zomato share price: జొమాటో షేరు ధర ఈరోజు 14 శాతానికి పైగా కుంగి జీవితకాల కనిష్ఠాన్ని తాకింది....

Updated : 25 Jul 2022 15:57 IST

ముంబయి: జొమాటో షేర్లకు కష్టాలు తప్పవన్న విశ్లేషకుల అంచనాలు నిజమవుతున్నాయి! ఏడాది పాటు లాక్‌-ఇన్‌ పీరియడ్‌లో కొనసాగిన 613 కోట్ల షేర్లను (మొత్తం షేర్లలో 77.87 శాతం) విక్రయించుకునే గడువు రావడంతో కంపెనీ షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. ఈరోజు ఓ దశలో షేరు 14 శాతం మేర పతనమై రూ.46 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద స్థిరపడింది. గత ఏడాది నవంబరులో నమోదైన జీవితకాల గరిష్ఠం రూ.169.10 నుంచి ఈ షేరు ఇప్పటి వరకు 73 శాతం కుంగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి 65 శాతం దిగజారింది.

* వ్యవస్థాపకులతో పాటు ఇతర మదుపర్ల దగ్గర 613 కోట్ల షేర్లు ఏడాది పాటు లాక్‌ ఇన్‌లో ఉన్నాయి. 2021 జులై 23న ఈ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఏడాది కాలావధి ముగుస్తున్నందున, ఈనెల 23 నుంచి వాటిని వారు విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీంతో స్టాక్‌ ధరపై ప్రభావం పడింది.

* జొమాటో షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన తర్వాత యాంకర్‌ మదుపర్లకు కేటాయించిన షేర్లను నెల పాటు విక్రయించడానికి వీలు లేదు. అది ముగిసిన మరుసటి రోజే షేరు 8 శాతం నష్టపోయాయి. ఈ విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

* పబ్లిక్‌ ఇష్యూలో రూ.76 చొప్పున జొమాటో షేర్లు కేటాయించారు. 2021 జులై 23న షేరు 51 శాతం ప్రీమియంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.115 వద్ద నమోదైంది. తర్వాత రోజుల్లో షేరు విలువ జీవన కాల గరిష్ఠమైన రూ.169 స్థాయికి చేరడమే కాదు.. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువను  సాధించింది. తదుపరి షేరు విలువ తగ్గుతూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు