IRCTC - Zomato: రైల్లో ఫుడ్‌ డెలివరీ.. జొమాటోతో ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యం!

IRCTC-Zomato: ప్రయాణికులకు మరిన్ని ఫుడ్‌ ఆప్షన్లను అందించడంలో భాగంగా ఐఆర్‌సీటీసీ జొమాటోతో చేతులు కలిపింది. ప్రయాణికుల ముందుగా బుక్‌ చేసుకున్న ఆర్డర్లను ఈ ఫుడ్‌ డెలివరీ యాప్‌ సాయంతో వారికి అందించనుంది.

Published : 18 Oct 2023 12:52 IST

IRCTC - Zomato | ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే విషయంలో మరిన్ని ఆప్షన్లను కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) సిద్ధమైంది. ప్రయాణికులు ముందుగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను తెప్పించేందుకు ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato)తో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఐదు స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్లకూ విస్తరించే అవకాశం ఉంది.

ఐఆర్‌సీటీసీ (IRCTC)కి చెందిన ఈ-క్యాటరింగ్‌ సేవల కింద ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. వాటిని జొమాటో (Zomato) సాయంతో ఆయా స్టేషన్లలో వారికి అందజేస్తారు. ‘ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ (PoC)’ కింద ప్రస్తుతానికి దీన్ని న్యూదిల్లీ, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. ఆహారం విషయంలో ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్లను అందించడంలో భాగంగానే జొమాటోతో చేతులు కలిపినట్లు ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. మరోవైపు పండగ సీజన్‌ నేపథ్యంలో రైల్వే క్యాటరింగ్‌ సర్వీస్‌ ప్రత్యేక సేవలు, ఆఫర్లతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే వారి కోసం ప్రత్యేక ‘థాలీ’ని అందిస్తోంది.

ఈ నేపథ్యంలో జొమాటో షేరు (Zomato Share price) ఈ రోజు ఆరంభంలో రూ.115 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరింది. కానీ, గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగతో తిరిగి నష్టాల్లోకి జారకుంది. మరోవైపు ఐఆర్‌సీటీసీ షేరు (IRCTC Share price) రూ.700 వద్ద దాదాపు రెండు శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని