Meta: ‘మేనేజ్‌ చేస్తే సరిపోదు.. కోడింగ్ రాయాల్సిందే’ మెటా మేనేజర్లకు జుకర్‌బర్గ్‌ హెచ్చరిక!

మెటా (Meta)లో మేనేజర్ల వ్యవస్థపై కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనేజర్లు, డైరెక్టర్లు వ్యక్తిగత పనితీరులో ప్రతిభ చూపించకుంటే లేఆఫ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. 

Published : 08 Feb 2023 23:06 IST

వాషింగ్టన్‌: కంపెనీ లేఆఫ్‌ల ప్రక్రియలో భాగంగా మెటా (Meta) సంస్థ ఇటీవలే 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. 18 ఏళ్ల కంపెనీ చరిత్రలో ఈస్థాయిలో కోతలు విధించడం అదే తొలిసారి. ఈ నేపథ్యంలో మేనేజర్ల వ్యవస్థపై కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ఉద్యోగులతోపాటు, మధ్యశ్రేణిలో కొంతమంది మేనేజర్లకు సైతం లేఆఫ్‌లు విధించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లు, డైరెక్టర్లను జుకర్‌బర్గ్‌ హెచ్చరించారట. ఉద్యోగ విధుల్లో భాగంగా కేవలం మేనేజ్‌మెంట్ చేస్తే సరిపోదని.. కోడింగ్‌, డిజైనింగ్‌, పరిశోధన వంటి ఇతర విభాగాల్లో సైతం  వారు తమ సేవలను అందించాలని సూచించినట్లు సమాచారం. వ్యక్తిగతంగా పనితీరులో ప్రతిభ చూపించలేని వారు ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఉన్నతస్థాయి ఉద్యోగులను ఆదేశించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. 

2023ని కంపెనీ సమర్థత (Year of Efficiency) ఏడాదిగా జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థత కలిగిన సంస్థగా ముందుకు సాగాలి. మేనేజర్లు, డైరెక్టర్లు వ్యక్తిగతంగా కంపెనీ కోసం తమ సహకారాన్ని అందించాలి. ఒకవేళ వ్యక్తిగత పనితీరులో ప్రతిభ చూపించలేని వారు లేఆఫ్‌లను ఎదుర్కొవాల్సి ఉంటుంది’’ అని జుకర్‌బర్గ్‌ మేనేజర్లు, డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు  మెటాలో మరిన్ని లేఆఫ్‌లు ఉంటాయనేందుకు సంకేతాలని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు