
Bhagat Singh: భగత్ సింగ్లా నటించబోయి.. నిజంగానే ఉరేసుకున్నాడు..!
లఖ్‌నవూ: భారత స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నారులు చేస్తున్న నాటక ప్రదర్శన రిహార్సల్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు సంబంధించిన నాటకంలో భాగంగా ఆయన్ను ఉరితీసే సన్నివేశాన్ని రిహార్సల్స్ చేస్తున్న పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కువర్గావ్ జిల్లాకు చెందిన భూరే సింగ్ కుమారుడు శివమ్ తన మిత్రులతో కలిసి భగత్ సింగ్‌ను ఉరితీసిన సన్నివేశాన్ని సాధన చేస్తున్నాడు. అందులో భాగంగా ఉరితాడును అతడి మెడకు వేసుకున్నాడు. అదే సమయంలో కాళ్ల కింద ఉన్న చిన్న పీట జారిపోయి పక్కకు పడిపోవడంతో ఆ ఉరితాడు బాలుడి మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. దీంతో అక్కడున్న పిల్లలంతా కంగారుపడి కేకలు వేశారు. అది విని సమీపంలోని స్థానిక వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. బాలుడి మెడకు బిగుసుకున్న తాడును కత్తిరించి అతడిని కిందికి దింపాడు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి తల్లిదండ్రులు అతడికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మరణంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అతడి కుటుంబం సుముఖంగా లేదని ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గ్రామానికి పోలీసుల బృందాన్ని పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.