Road Accident: చీకట్లోనే తెల్లారిన బతుకులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు.

Published : 11 Jul 2024 02:43 IST

యూపీలో ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో 18 మంది మృతి
19 మందికి గాయాలు 
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  బిహార్‌ నుంచి దిల్లీకి వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు వేగంగా వచ్చి పాల ట్యాంకర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. వాటి డ్రైవర్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తన కుటుంబంలో ఆరుగురిని కోల్పోయినట్లు దిల్షాద్‌ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వచ్చిన స్థానికులు బస్సులో ఇరుక్కుపోయిన తమను కాపాడకుండా మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ గడిపినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లో 8 మంది మృతి

గుణ: మధ్యప్రదేశ్‌లో బుధవారం రెండు చోట్ల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నర్మదాపురం జిల్లాలో ఓ ఎంయూవీ వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. గుణ జిల్లాలో వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు.. బస్సును వెనకనుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని