crime news: అసలే మద్య నిషేధిత రాష్ట్రం.. ఆపై ఎక్సైజ్‌ స్టేషన్లో ఖైదీలతో పోలీసుల మందుపార్టీ..!

మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో పోలీసులు-ఖైదీలు మందుపార్టీ చేసుకొన్నారు. అది కూడా ఎక్సైజ్‌ స్టేషన్‌ వేదికగా. 

Updated : 02 Dec 2022 13:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో ఏకంగా ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మందు పార్టీ జరిగింది. అది కూడా పోలీసులు-ఖైదీలు కలిసి చేసుకొన్నారు. ఈ ఘటన పట్నా జిల్లాలోని పాలిగంజ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. వాస్తవానికి బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉండటంతో ఏకంగా ఎక్సైజ్‌ స్టేషన్‌లోకి మద్యం ఎలా వచ్చిందో అర్థంకావడంలేదు. సిబ్బంది గానీ, ఖైదీలకు సంబంధించిన వ్యక్తులు గానీ స్టేషన్‌లోకి మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం ఎక్సైజ్‌ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. వారి వద్దకు ఆ రోజు రాత్రి మద్యం చేరింది. దీంతో వారు పార్టీ చేసుకోవడం మొదలుపెట్టారు. వీరిలో ఒక ఖైదీ వీడియో తీసి తన కుటుంబసభ్యులకు పంపాడు. తనకు పోలీస్‌ కస్టడీలో ఎటువంటి ఇబ్బంది లేదని వారికి తెలిపాడు. అయితే.. ఈ వీడియోలో సియారామ్‌ మండల్‌, ఛోటే లాల్‌ మండల్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఖైదీలతో కలిసి ఉన్నట్లు కనిపించడం కలకలం రేపింది. ఆ వీడియో వైరల్‌గా మారి.. పట్నాలోని సీనియర్‌ అధికారుల వద్దకు చేరింది. చివరికి పాలిగంజ్‌ పోలీసుల దృష్టికి కూడా రావడంతో హుటాహుటిన ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకొని పార్టీని ఆపారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఖైదీలు లాకప్‌లోనే ఉన్నారు.

‘ఖైదీలు మద్యం పార్టీ చేసుకుంటున్న వీడియో మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము ఎక్సైజ్‌ స్టేషన్‌పై రైడ్‌ చేసి వారిని అదుపులోకి తీసుకొన్నాం. వారికి మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నాం’ సబ్‌ డివిజనల్‌ అధికారి అవదేష్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు