Published : 30 Jun 2022 02:13 IST

Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!

ఫిర్యాదు స్వీకరించని పోలీసులు.. భగ్గుమన్న ప్రజలు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని సార్జాపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను వివస్త్రలుగా చేసి, వారిపై దాడి చేశారు. తీసుకున్న అప్పు మొత్తం ఒకేసారి చెల్లించలేదనే కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదును పోలీసులు రెండు రోజుల వరకు స్వీకరించకపోవడంపై ప్రజలు భగ్గుమన్నారు. ఆందోళనల అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

అనేకల్​ తాలుకా దొడ్డబొమ్మసంద్రకు చెందిన ఓ మహిళ తన పిల్లల చదువుల కోసం.. నెరిగ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంది. అయితే.. ఇందుకు అతడు 30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు. అయినప్పటికీ బాధితురాలు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. కానీ తీసుకున్న రుణం మొత్తం తక్షణమే చెల్లించాలని రామకృష్ణ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. బాధితురాలు తన భూమిని అమ్మి.. డబ్బులు చెల్లించాల్సిందిగా గ్రామపెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఈలోపే నిందితులు బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఆమె సోదరితోనూ అదే తరహాలో దారుణంగా వ్యవహరించారు.

దాడి అనంతరం బాధితులు సార్జాపురా పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించినా ఎస్సై రాఘవేంద్ర వారి ఫిర్యాదును తీసుకోలేదు. నిందితులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు. అయితే, మహిళలపై దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఒత్తిడితో మంగళవారం రాత్రి ఫిర్యాదు స్వీకరించారు. రామకృష్ణారెడ్డితోపాటు మరో నిందితుడు సునీల్​ కుమార్​ను అరెస్టు చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని