Crime news: గోవధ అనుమానంతో గిరిజనులపై సామూహిక దాడి.. ఇద్దరి మృతి

గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో గిరిజనులను చితకబాదిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మందితో కూడిన బృందం...

Published : 04 May 2022 02:20 IST

భోపాల్‌: గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో గిరిజనులను చితకబాదిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మందితో కూడిన బృందం ఆ గిరిజనుల ఇంటికి వెళ్లి.. గోవధ చేశారంటూ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆపై ఇద్దరిని దారుణంగా కొట్టారన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు చెప్పారు. సియోని ఏఎస్పీ ఎస్‌కే మారావి, ఇతర అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. 20 మందిపై అభియోగాలు మోపామని, వారిలో ఆరుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

దాడిలో గాయపడిన బ్రజేష్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో సంపత్, ధన్సాలను నిందితులు కర్రలతో దారుణంగా కొట్టారని, అక్కడికి వెళ్లగా తనపైనా దాడి చేశారని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని, గాయపడిన వ్యక్తికి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్  డిమాండ్‌ చేశారు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఆదివాసీలపై అత్యధిక నేరాలు మధ్యప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా జబల్‌పూర్- నాగ్‌పూర్ హైవేపై నిరసనకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని