
యజమాని గొంతు కోసి.. బావిలో పడేసి..
జీతం విషయంలో జరిగిన గొడవతో హత్యకు పాల్పడ్డ నౌకరు
దిల్లీ: జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తస్లీమ్ (21), యజమాని ఓంప్రకాశ్ (45) డెయిరీ ఫామ్‌లో రూ.15 వేల జీతానికి పనిచేసేవాడు. అయితే కరోనాతో నష్టపోయానని, ఈనెల తక్కువ జీతం తీసుకోవాల్సిందిగా తస్లీమ్‌ను యజమాని కోరాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఓంప్రకాశ్ నౌకరుపై చేయిచేసుకున్నాడు.
యజమానిపై కోపం పెంచుకున్న అతడు ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న ఓం ప్రకాశ్ తలపై కర్రతో దాడిచేశాడు. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీప బావిలో పడేసి పరారయ్యాడు. తర్వాతి రోజు యజమాని బంధువులకు ఫోన్ చేసి వ్యాపార పనిపై తాను ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపాడు. అయితే ఓం ప్రకాశ్ రెండు రోజులుగా కనిపించడం లేదంటూ అతడి మేనల్లుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డెయిరీ ఫాం వద్ద పరిశీలిస్తుండగా అక్కడి బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. వెళ్లి చూడగా బాధితుడి మృతదేహం బావిలో తేలుతూ కనిపించింది.
దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మృతుడి బైకు, సెల్‌ఫోన్‌ను తస్లీమ్ ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. యూపీతోపాటు హరియాణాలోని పలు ప్రాంతాల్లో గాలించినా నిందితుడి ఆచూకీ లభించలేదు. దిల్లీలోని ఝరోడా ప్రాంతంలో ఉన్నట్లు ఆదివారం సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.