Assault: యువ వైద్యుడిపై దాడి.. 24మంది అరెస్టు 

అసాంలో హొజాయి జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగి చనిపోవడంతో అతడి బంధువులు యువ వైద్యుడితో పాటు సిబ్బందిపైన దాడి చేశారు. ఆ కేంద్రంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు

Published : 03 Jun 2021 01:19 IST

హొజాయి: అసాంలో హొజాయి జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగి చనిపోవడంతో అతడి బంధువులు యువ వైద్యుడితో పాటు సిబ్బందిపైన దాడి చేశారు. ఆ కేంద్రంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఉడాలి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విధుల్లో ఉన్న వైద్యుడిపై దాడి చేసినందుకు 24మందిని అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే.. కరోనాతో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఉడాలిలోని కొవిడ్ కేర్‌ సెంటర్‌లో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ యువ వైద్యుడు సేనాపతి, ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వైద్యుడిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. డాక్టర్‌పై దాడి చేస్తున్న దృశ్యాలను మరో వైద్యుడు చిత్రీకరించి అసాం ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

సీఎం సీరియస్‌

ఈ ఘటనపై అసాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లపై దాడులను సహించబోమన్నారు. ఈ కేసును తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఉడాలి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్యుడిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంతా తెలిపారు. ఒక మహిళతో పాటు మొత్తం 24మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. 

దీనిపై వైద్యుడు సేనాపతి స్పందిస్తూ.. ఆ రోగి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు చెప్పడంతో తాను వెళ్లానని, అక్కడికి వెళ్లి చూసేటప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని, తనపైనా దాడి చేశారని వాపోయారు. అయితే ఆ వైద్యుడి సర్వీసులో అదే తొలిరోజు కావడం గమనార్హం.

మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా గువాహటి వైద్యకళాశాలలోని అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో  ఉదయం 8.30గంటల నుంచి 1.30వరకు బయటి రోగుల సేవలను నిలిపివేశారు. దాడి ఘటనను భారతీయ వైద్యుల సంఘం కూడా ఖండించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని