Borewell: మూడ్రోజులైంది.. నా బిడ్డను త్వరగా బయటకు తీయండి.. ఓ తల్లి రోదన

మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌ జిల్లా మాండవి గ్రామంలో మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బోరు బావి(Borewell)లో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు గత ఇంకా సహాయక చర్యలు(Rescue operation) కొనసాగుతున్నాయి.

Published : 10 Dec 2022 01:56 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌ జిల్లా మాండవి గ్రామంలో మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బోరు బావి(Borewell)లో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు గత ఇంకా సహాయక చర్యలు(Rescue operation) కొనసాగుతున్నాయి. తన్మయ్‌ (8) అనే బాలుడు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరు బావిలో జారిపడిన ఘటన విషాదం రేపిన విషయం తెలిసిందే. 50అడుగుల లోతులో చిక్కుకున్న ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బాలుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటి నుంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అలాగే, బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నారు. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

నేతలు, అధికారుల పిల్లలైతే ఇలాగేనా?: తల్లి ఆవేదన

మూడు రోజులు గడుస్తున్నా అధికార యంత్రాంగం ఆ బాలుడిని బయటకు తీయలేకపోవడంపై తన్మయ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారుల తీరుపట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ‘‘తక్షణమే నా బాబుని బయటకు తీయండి. ఏం చేసినా నాకు నా బిడ్డను తీసి ఇవ్వండి. ఒక నాయకుడి బిడ్డ, అధికారి బిడ్డ అయితే బయటకు తీయడానికి ఇంత సమయమే పట్టేదా? ఇప్పటికే చాలా సమయం గడిచినా ఏమీ చెప్పడంలేదు. చూడటానికి నేను వెళ్తానన్నా అనుమతించడంలేదు. తన్మయ్‌ మంగళవారం బోరుబావిలో పడిపోయాడు. ఈరోజు శుక్రవారం. నా కొడుకును బయటకు తీసుకురండి. నేను నా బిడ్డను చూడాలి’’ అంటూ తన కొడుకు కోసం ఆ తల్లి ఆర్తనాదాలు అందరినీ కలిచివేస్తున్నాయి. తన్మయ్‌ బోరుబావిలో పడిపోతున్నప్పుడు తన 12ఏళ్ల కూతురు చూసిందని తండ్రి సునీల్ సాహూ తెలిపారు. వెంటనే తనకు చెప్పడంతో ఘటనాస్థలం వద్దకు వెళ్లామని. అప్పటికి ఊపిరి పీల్చుకొంటున్నాడని.. తమ మాటలకు స్పందించాడని తెలిపారు. 

మరోవైపు, మూడో తరగతి చదువుతున్న తన్మయ్‌ క్షేమంగా బయటకు రావాలని కోరుతూ తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గాయత్రి మంత్రం జపిస్తున్నారు. ఈ ఘటనపై బేతల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యామేంద్ర జైశ్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే 45 అడుగులకు పైగా సొరంగం తవ్వకం పూర్తయింది. మధ్య మధ్యలో బండరాళ్లు తగలడం వల్ల యంత్రాలతో వాటిని విరగ్గొట్టడంతో సమయం పడుతోంది. ఇది అత్యంత సున్నితమైన పరిస్థితి కావడంతో బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతూ పిల్లవాడిని చేరుకొని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు