Crime News: చదువుకున్నారు.. చోరీలను ఎంచుకున్నారు!

ఒకరు బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు.

Published : 05 Jul 2024 04:48 IST

స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు, నిందితుడు విద్యాధర్‌తో గుంటూరు నగరం కొత్తపేట స్టేషన్‌ పోలీసులు

గుంటూరు నేరవార్తలు, చీరాల అర్బన్, న్యూస్‌టుడే: ఒకరు బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.. మరొకరు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.. ఇంకొకరు డిగ్రీ చదివారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకొని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు దురలవాట్లకు బానిసలుగా మారి.. పక్కదారి పట్టారు. జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. 

బీటెక్‌ విద్యార్థి 

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన విద్యాధర్‌ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాల కోసం లోన్‌ యాప్‌ల్లో అప్పులు తీసుకున్నాడు. వాటిని కట్టడానికి  ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవాడు. గుంటూరు నగరంలోని డీమార్టు వద్ద గురువారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా విద్యాధర్‌ను స్థానిక కొత్తపేట స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుకున్నారు. అతడిని విచారించగా పది రోజుల వ్యవధిలో ఎనిమిది ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని సీఐ అన్వర్‌ బాషా తెలిపారు. 

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేసి..

కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడుకి చెందిన ఇల్లూరి హరినాథ్‌రెడ్డి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. జల్సాలు, బెట్టింగులకు అలవాటు పడిన అతడు రైళ్లలో సెల్‌ఫోన్లు తస్కరించేవాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో గోవా, బెంగళూరుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో చీరాల రైల్వే స్టేషన్‌లో ఉన్న అతడిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.2,26,898 విలువ చేసే ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

డిగ్రీ పూర్తి చేసి..

తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన రమావత్‌ రవి డిగ్రీ వరకు చదువుకొని ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటుపడిన అతడు చోరీల బాట పట్టాడు. ఈ ఏడాది మేలో గుంటూరు కొత్తపేటలోని ఓ చిన్నపిల్లల ఆసుపత్రిలో ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తోపాటు ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కొత్తపేటలో సంచరిస్తున్న రవిని గురువారం అరెస్టు చేశారు. 31 ఏళ్ల వయసున్న నిందితుడిపై తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 25 దొంగతనాల కేసులు నమోదైనట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని