Delhi: 40శాతం పెరిగిన అత్యాచారం కేసులు!

మహిళలపై అకృత్యాలకు దేశ రాజధాని దిల్లీ కేంద్ర బిందువుగా మారుతోంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, హింసకు సంబంధించిన కేసులు గతేడాదితో పోలిస్తే ఈసారి 40శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి.

Published : 07 Jul 2021 01:23 IST

దేశరాజధానిలో మహిళలపై పెరుగుతోన్న హింస

దిల్లీ: మహిళలపై అకృత్యాలకు దేశ రాజధాని దిల్లీ కేంద్ర బిందువుగా మారుతోంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, హింసకు సంబంధించిన కేసులు గతేడాదితో పోలిస్తే ఈసారి 40శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. వీటితో పాటు స్నాచింగ్‌ కేసులు కూడా పెరగగా.. తక్కువ తీవ్రత కలిగిన కేసుల సంఖ్య మాత్రం కాస్త తగ్గినట్లు వెల్లడైంది.

గతే ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈఏడాది మొదటి ఆరు నెలల కాలంలో దిల్లీలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన గణాంకాలను అక్కడి అధికారులు వెల్లడించారు. అధికారుల సమాచారం ప్రకారం, దిల్లీలో స్నాచింగ్‌ కేసుల సంఖ్య 46శాతం పెరిగాయి. ఈఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 2315 క్రూరమైన నేరాలు నమోదుకాగా వాటిలో 196-హత్య, 295-హత్యాయత్నం, 942-దోపిడి, ఏడు కిడ్నాప్‌ కేసులతో పాటు 833 అత్యాచార కేసులు నమోదయ్యాయి. గతేడాది అదే కాలంలో 580 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈఏడాది అత్యాచార కేసులు దాదాపు 43శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. వీటికితోడు మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు కూడా దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ తరహా కేసుల సంఖ్య 39శాతం పెరిగినట్లు దిల్లీ అధికారులు వెల్లడించారు.

ఇక క్రూరమైన కేసులు కానివి కూడా దిల్లీలో భారీగానే చోటుచేసుకుంటున్నాయి. గతేడాది ఇటువంటివి లక్షా 11వేల కేసులు నమోదుకాగా ఈ ఏడాది లక్షా 20వేల కేసులు నమోదయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక దిల్లీలో స్నాచింగ్‌ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది. గతేడాది 2612 కేసులు నమోదుకాగా ఈసారి 3829 స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా దేశరాజధానిలో నేరాల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ శ్రీవాస్తవ.. నేరాలను అదుపులోకి తేవడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని