
Crime news: హైవేలపై కాపుకాస్తారు.. మహిళల్ని టార్గెట్ చేసి కాటేస్తారు!
సీరియల్ గ్యాంగ్ రేప్‌ల ముఠా అరెస్ట్.. వీడియోలు స్వాధీనం
జైపూర్: జాతీయ రహదారులపై ప్రయాణించే మహిళల్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడే కిరాతక ముఠాను రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి కొన్ని అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజులకోసారి హైవేలపై ఇలాంటి నేరాలకు ఈ ముఠా తెగబడేదని పోలీసులు తెలిపారు. వీరంతా వరుస గ్యాంగ్ రేప్‌లకు పాల్పడినట్టు వీడియోలను బట్టి తెలుస్తోందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎనిమిది మందితో కూడిన ఈ ముఠాలో ఎక్కువ మంది 20 ఏళ్ల వయసు కలిగినవారేననీ.. వీరంతా దోపిడీ, అపహరణలకు పాల్పడుతుంటారని ప్రతాప్‌గఢ్ జిల్లా ఎస్పీ అమృతా దుహాన్ వెల్లడించారు. అరెస్టయిన ఐదుగురిలో మైనర్ కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. పలువురు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఓ పెట్రోల్ బంక్‌లో దోపిడీకి ప్రణాళిక రచిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల నుంచి కారం, ఇనుపరాడ్, రెండు కర్రలు, కత్తులు, నైలాన్ తాడు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని అందరికీ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
వీరంతా కూరగాయల వ్యాపారంతో పాటు ధరియావాడ్‌లో చిన్న.. చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మద్యం మత్తులో ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి అత్యాచారాలకు ప్లాన్ వేసేవారని పేర్కొన్నాయి. ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి.. జంటలను లక్ష్యంగా మాటు వేసేవారని పోలీసులు తెలిపారు. దంపతులు కనబడగానే వ్యక్తిపై దాడిచేసి అతడి నుంచి దోచుకొని మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడేవారని వివరించారు. అనంతరం ఆ మహిళను గ్రామ శివారులలో వదిలి వెళ్లేవారు. అంతేకాకుండా ఈ దుశ్చర్యను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించేవారని .. పోలీసులకు ఈ విషయం చెబితే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తాంటూ బాధితులను బెదిరించేవారని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.