
వెంటాడి.. వేటాడి జర్నలిస్టు హత్య
కేసును తప్పుదారి పట్టిస్తున్నారని బాధితుడి తండ్రి ఆరోపణ
బాలియా: ఓ టీవీ జర్నలిస్టును దుండగులు వెంటాడి, వేటాడి కాల్చి చంపారు. తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. హత్యకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘స్థానిక టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న రతన్‌సింగ్(42)కు, అతడి సమీపంలో నివసించే ఓ కుటుంబానికి కొన్నేళ్లుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నిందితులు ఓ ప్రాంతంలో గోడ నిర్మించి అందులో గడ్డివాము ఉంచారు. దానిని రతన్‌సింగ్ తీయించాడు. దీంతో వారి మధ్య వివాదం మొదలైంది’ అని ఆజామ్‌గఢ్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుభాష్ దూబే తెలిపారు.
సోమవారం రాత్రి రతన్‌సింగ్ స్వగ్రామానికి వెళ్లి వస్తుండగా మాటువేసిన నిందితులు అతడిని వెంటాడి తుపాకీతో కాల్చి చంపినట్లుగా సుభాష్ దూబే పేర్కొన్నారు. బాధితుడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. హత్యకు పాల్పడ్డ నిందితులు అరవింద్‌సింగ్, దినేష్‌సింగ్, సునీల్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుడి కుటుంబానికి తన సంతాపాన్ని తెలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
భూ వివాదం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొనడాన్ని బాధితుడి తండ్రి బినోద్‌సింగ్ విభేదించారు. తమకు ఎలాంటి భూ తగాదాలు లేవని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘నా కుమారుడికి ఎలాంటి భూ వివాదాలు లేవు. కావాలంటే వచ్చి పరిశీలించండి. స్థానిక పోలీసులు నిందితులతో కుమ్మక్కై ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించారు’ అని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.