crime news: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం

అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు.

Published : 15 Jun 2024 06:23 IST

తల్లి పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి ఘాతుకం
పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో ఘోరం
నిందితుడు బిహార్‌కు చెందిన హమాలీ

చిన్నారి.. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన ప్రదేశం 

అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. అతడు భుజానికెత్తుకొని తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆ ఆరేళ్ల పాపాయి గాఢనిద్రలో ఉన్నట్టు సీసీ ఫుటేజీ దృశ్యాల్లో కనిపిస్తోంది. అతడి దుశ్చర్యకు పాపం ఎంతగా విలవిల్లాడిపోయిందో... గొంతు నులిమి ప్రాణాలను చిదిమేస్తున్నప్పుడు విడిపించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఏమో! దరిదాపుల్లో కాపాడేవారు ఎవరూ లేక రక్తపు మడుగులో చివరికి ఆ చీకటిలోనే శాశ్వత నిద్రలోకి జారిపోయింది.

సుల్తానాబాద్, న్యూస్‌టుడే: ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు పాశవికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, స్థానికుల కథనం ప్రకారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు నెల రోజుల కిందట కాట్నపల్లికి వచ్చి గ్రామ శివారులోని బియ్యం మిల్లులో హమాలీ కార్మికులుగా పనిలో చేరారు. వారికి ఆరేళ్లు, ఏడు నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. మిల్లు ఆవరణలోని రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో షెడ్డు బయట రేకుల కింద పిల్లలతో కలిసి దంపతులు నిద్రించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మహిళకు మెలకువ రాగా.. పక్కన ఉండాల్సిన పెద్ద కూతురు(6) కనిపించలేదు. భర్తను, అదే మిల్లులో పని చేస్తున్న బంధువులను నిద్ర లేపి చెప్పింది. వారు యజమానికి సమాచారం అందించగా ఆయన మిల్లుకు వచ్చి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. చిన్నారి తండ్రి ఫోన్‌ చేయగా.. సుల్తానాబాద్‌ పోలీసులు వచ్చి మిల్లు పరిసర ప్రాంతాల్లో గాలించారు. చీకటిగా ఉండడంతో ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో చిన్నారి తండ్రి పక్కనే ఉన్న మరో బియ్యం మిల్లు వెనకాల కుంట వైపు వెతికారు. అక్కడ పొదల్లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. నిందితుడు ఆమెను శారీరకంగా హింసించిన ఆనవాళ్లున్నాయి. బాలిక చెంపలపై పంటి గాట్లున్నాయి. తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులు విరిచినట్లుగా వాలిపోయి ఉన్నాయి. రక్తం మడుగులో విగతజీవిగా కనిపించిన బిడ్డను చూసి తల్లితండ్రులు గుండెలవిసేలా రోదించారు. 

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు

నిందితుడు చిన్నారిని భుజంపై ఎత్తుకెళ్లిన దృశ్యాలు.. మృతురాలి కుటుంబం నిద్రించిన షెడ్డుకు సమీపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు. బాధిత కుటుంబం పని చేస్తున్న మిల్లుకు పక్కనున్న మరో మిల్లులో పని చేస్తున్న బిహార్‌కు చెందిన వినోద్‌ మాజే (28) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న చిన్నారిని నిందితుడు ఎత్తుకెళ్లి తను పని చేస్తున్న మిల్లు వెనకాల ఉన్న కుంట ఒడ్డున అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం మిల్లు ఆవరణలో దుస్తులు ఉతుక్కుంటున్న వినోద్‌ మాజేను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. నిందితుడి భార్య, ముగ్గురు పిల్లలు బిహార్‌లో ఉండగా.. పది రోజుల కిందట అతడు ఒక్కడే వచ్చి.. మిల్లులో హమాలీగా చేరాడు.

కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

అభం శుభం తెలియని చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ పార్టీల వారు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు సుల్తానాబాద్‌లోని రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో అరగంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని