
Mumbai: రూ.7 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఏడుగురి అరెస్టు!
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడుల్లో రూ.7 కోట్ల మేర నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. దీంతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అంతర్రాష్ట్ర ముఠాకు చెందినవారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ముంబయి శివారు ప్రాంతంలోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద నిందితుల కారును అడ్డగించినట్లు చెప్పారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వాహనంలోని సుమారు 250 కట్టల రూ.2 వేల నోట్లు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో అంధేరిలోని ఓ హోటల్‌పై దాడి చేసి మరో ముగ్గురుని అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి కూడా మరో రూ.2 కోట్లు విలువైన 100 కట్టల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా నుంచి.. నకిలీ నోట్లతో పాటు ఓ ల్యాప్ టాప్, ఏడు మొబైల్ ఫోన్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.