Bengal Train Accident: ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన గూడ్సు

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. దార్జీలింగ్‌ జిల్లాలోని రంగాపానీ స్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను.. వేగంగా దూసుకొచ్చిన ఓ గూడ్సు రైలు బలంగా వెనక నుంచి ఢీకొట్టింది.

Updated : 18 Jun 2024 05:58 IST

బెంగాల్‌లో ఘోర ప్రమాదం
9 మంది దుర్మరణం
వారిలో ఇద్దరు రైల్వే సిబ్బంది
41 మందికి గాయాలు
గూడ్సు అతివేగమే దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

పశ్చిమబెంగాల్‌లోని రంగాపానీ స్టేషన్‌ సమీపంలో గూడ్సు ఢీకొన్న అనంతరం గాల్లోకి లేచిన కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ బోగీ

కోల్‌కతా, న్యూ జల్పాయీగుడీ: పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. దార్జీలింగ్‌ జిల్లాలోని రంగాపానీ స్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను.. వేగంగా దూసుకొచ్చిన ఓ గూడ్సు రైలు బలంగా వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. మరో 41 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో గూడ్సు రైలు పైలట్, ఎక్స్‌ప్రెస్‌ రైలు గార్డు ఉన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే ముప్పుందని అధికారులు తెలిపారు. మరోవైపు బెంగాల్‌ పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను 15గా పేర్కొనడం గమనార్హం. 

ప్రమాదం ఎలా జరిగిందంటే.. 

త్రిపుర రాజధాని అగర్తలా నుంచి బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని సియాల్‌దహ్‌కు బయలుదేరిన కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం ఉదయం 8:27 గంటలకు ఉత్తర బెంగాల్‌లోని దార్జీలింగ్‌ జిల్లాలో రంగాపానీ స్టేషన్‌ను దాటింది. అనంతరం రానీపత్రా రైల్వేస్టేషన్, ఛత్తర్‌హాట్‌ జంక్షన్‌ల మధ్య ఆగింది. గూడ్సు రైలు ఉదయం 8:42 గంటలకు రంగాపానీని దాటి దూసుకొచ్చింది. అదే ట్రాక్‌పై నిలిపి ఉన్న కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను 8:55 గంటల సమయంలో వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద స్థలం ఉత్తర బెంగాల్‌లోని న్యూ జల్పాయీగుడీ స్టేషన్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

గాల్లోకి లేచిన బోగీ 

ప్రమాద తీవ్రతకు కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన గార్డు కోచ్, రెండు పార్సిల్‌ కోచ్‌లు, ఒక జనరల్‌ బోగీ (మొత్తం నాలుగు కోచ్‌లు) పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి గూడ్సు రైలు ఇంజిన్‌పైకి ఎక్కి.. గాల్లో భయానక స్థితిలో వేలాడుతూ ఉండటం ప్రమాద స్థాయికి అద్దం పట్టింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులతోపాటు జిల్లా అధికార వర్గాలు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.  

పనిచేయని ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ 

రైళ్ల రాకపోకలను నియంత్రించే ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ రానీపత్రా రైల్వేస్టేషన్, ఛత్తర్‌హాట్‌ జంక్షన్‌ మధ్య సోమవారం ఉదయం 5:50 గంటల నుంచి పనిచేయలేదు. సాధారణంగా ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలు తలెత్తినప్పుడు.. రైళ్లకు స్టేషన్‌ మాస్టర్‌ ‘టీఏ 912’ అనే లిఖితపూర్వక అనుమతిని జారీ చేస్తారు. అది అందితే- ఆ సెక్షన్‌లోని అన్ని రెడ్‌ సిగ్నళ్లను (సాంకేతిక లోపం కారణంగా ఉంటాయి కాబట్టి) రైలు దాటుకొని వెళ్లొచ్చు. రానీపత్రా స్టేషన్‌ మాస్టర్‌ కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు ‘టీఏ 912’ జారీ చేశారు. అదే స్టేషన్‌ మాస్టర్‌ గూడ్సు రైలు పైలట్‌కూ ‘టీఏ 912’ ఇచ్చారు. ‘‘ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయడం లేదు. కాబట్టి రానీపత్రా రైల్వేస్టేషన్, ఛత్తర్‌హాట్‌ జంక్షన్‌ మధ్య అన్ని ఆటోమేటిక్‌ సిగ్నళ్లను దాటి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నా’’ అని అందులో  పేర్కొన్నారు. రానీపత్రా రైల్వేస్టేషన్, ఛత్తర్‌హాట్‌ జంక్షన్‌ మధ్య 9 సిగ్నళ్లు ఉన్నాయని.. వాటిలో ఎరుపు రంగు హెచ్చరిక సహా ఏ సిగ్నల్‌ కనిపించినా పట్టించుకోకుండా దాటేయొచ్చని అందులో సూచించారు. 

పరిమితికి మించిన వేగమే కారణమా? 

సిగ్నల్‌ నియమాలను గూడ్సు రైలు పైలట్‌ ఉల్లంఘించడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ విఫలమైనప్పుడు అనుసరించాల్సిన నిబంధనలకు ఆయన కట్టుబడి ఉండలేదని పేర్కొంది. ‘టీఏ 912’ జారీ అయినప్పటికీ ప్రొటోకాల్‌ ప్రకారం- ఆటోమేటిక్‌ సిస్టమ్‌లో రెడ్‌ సిగ్నల్‌ ఉన్నప్పుడు లోకో పైలట్‌ గంటకు 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లకూడదని రైల్వే బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో దృశ్యగోచరత సరిగా లేకపోతే వేగం గంటకు 10 కిలోమీటర్లు మించకూడదని స్పష్టం చేశారు. ఆ పరిమితిని గూడ్సు పైలట్‌ ఉల్లంఘించడంతో ఘోరం జరిగిందని పేర్కొన్నారు.  

కొందరికి శాపం.. కొందరికి వరం! 

తాజా ప్రమాదంలో పట్టాలు తప్పిన బోగీలు అగర్తలా నుంచి అస్సాంలోని లుమ్డింగ్‌కు చేరుకునేదాకా కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు ముందుభాగంలో ఉన్నాయి. లుమ్డింగ్‌లో రైలు ప్రయాణ దిశ మారుతుంది. ఫలితంగా ముందు బోగీలు వెనక్కి, అప్పటిదాకా వెనకున్న కోచ్‌లు ముందుకు మారినట్లయింది. దీంతో- అగర్తలాలో ప్రయాణ ప్రారంభ సమయంలో వెనక కోచ్‌లలో ఉన్న ప్రయాణికులకు.. లుమ్డింగ్‌లో ప్రయాణ దిశ మార్పిడి వరంగా మారింది. తొలుత ముందు బోగీల్లో ఉన్నవారికి మాత్రం శాపంగా మారిపోయింది. 

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గువాహతి-సరాయీఘాట్‌ ఎక్స్‌ప్రెస్, గువాహటి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, ఎన్‌జేపీ-హావ్‌డా వందేభారత్, కామ్‌రూప్‌ ఎక్స్‌ప్రెస్, ఉత్తర్‌బంగా ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్లను దారి మళ్లించినట్లు కోల్‌కతాలోని తూర్పు రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు- ప్రమాదానికి గురైన కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌.. ఇతర బోగీల్లో సురక్షితంగా ఉన్న ప్రయాణికులతో సియాల్‌దహ్‌కు రాత్రి కల్లా చేరుకుంది. 

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి 

రైలుప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  మరోవైపు- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తాజా ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయాలైనవారికి రూ.50 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. 


‘కవచ్‌’ ఉండి ఉంటే..?

ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించేందుకు ‘కవచ్‌’ అనే రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రస్తుత దుర్ఘటన చోటుచేసుకున్న మార్గంలో ఆ సాంకేతికత ఇంకా అందుబాటులోకి రాలేదు. అది ఉండి ఉంటే తాజా ప్రమాదం చోటుచేసుకొని ఉండేది కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా 1,500 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌పై ‘కవచ్‌’ సాంకేతికత పనిచేస్తోందని.. ఈ ఏడాది చివరికల్లా మరో 3 వేల కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తుందని రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని