Barabanki Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, 26 మంది గాయాలపాలయ్యారు. బస్సులో 70 మంది ప్రయాణికులు...

Updated : 07 Oct 2021 14:05 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, 26 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. దిల్లీ నుంచి బహ్రయిచ్‌కు వెళ్తోంది. వారంతా నిద్రలో ఉండగా, మార్గమధ్యలో బారాబంకి జిల్లాలోని బాబురి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదర్శ్‌సింగ్‌, ఎస్పీ యమునా ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు. క్షతగాత్రులను బారాబంకి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైనవారిని లఖ్‌నవూకు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని