UP: 42 ఏళ్ల క్రితం 10 హత్యలు.. 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు!
ఉత్తర్‌ప్రదేశ్‌లో 42 ఏళ్ల క్రితం నాటి సామూహిక హత్యల కేసులో 90 ఏళ్ల వృద్ధుడికి ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. మొత్తం 10 మంది నిందితుల్లో అతనొక్కడే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నాడు.
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 42 ఏళ్ల క్రితం నాటి సామూహిక హత్య కేసు (Shikohabad Murder Case)లో ఓ 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు పడింది. దీంతోపాటు కోర్టు అతనికి రూ.55 వేల జరిమానా కూడా విధించింది. అధికారుల వివరాల ప్రకారం.. 1981లో అప్పటి మైన్‌పురీ జిల్లాలోని శికోహాబాద్‌లో పలువురు కలిసి 10 మంది దళితులను కాల్చి చంపారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 10 మంది నిందితులపై మెయిన్‌పురి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
అయితే, శికోహాబాద్ ఇప్పుడు ఫిరోజాబాద్ జిల్లాలోని మఖన్‌పూర్ పరిధిలోకి మారింది. ఈ క్రమంలో 2021 అక్టోబర్‌లో ఈ కేసు ఫిరోజాబాద్‌కు బదిలీ అయింది. అయితే, ఈ కేసులోని 10 మంది నిందితుల్లో తొమ్మిది మంది విచారణ సమయంలో మరణించారు. ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక నిందితుడు గంగా దయాళ్ (90)ను కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించింది. రూ.55 వేల జరిమానా కూడా వేసింది. చెల్లించని పక్షంలో అదనంగా 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.